26 మంది దళసభ్యుల హాజరు
ఇంజరిలో ఏపీ ఆన్‌లైన్ సిబ్బంది నిర్బంధం
పెదబయలు: విశాఖ మన్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరి పంచాయతీలో ఉపాధి కూలీలు, వింతంతు, వృద్ధాప్య పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రల సేకరణ (బయోమెట్రిక్) కోసం వెళ్లిన ఏపీ ఆన్‌లైన్ సిబ్బందిని శనివారం ఉదయం నుంచి 10 గంటలపాటు ప్రజాకోర్టులో ఉంచి సాయంత్రం విడిచి పెట్టారు. వారివద్ద ఉన్న మూడు బయోమెట్రిక్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది. ఇంజరి పంచాయతీ పరిధిలో ఈనెల 12 నుంచి 16 తేదీ వరకు బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు.
దీనిలో భాగంగా శనివారం ఉదయం ఇంజరి గ్రామానికి వచ్చిన ఏపీ ఆన్‌లైన్ మండల కో ఆర్డినేటర్లు వరహాలరాజు, నితిలేసి చంద్రశేఖర్, నేరుగ శివరామకృష్ణలను 26 మంది సాయుధ మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రజాకోర్టు నిర్వహించారు. తాము అధికారులం కాదని, కూలీపని కోసం వచ్చామని ముగ్గురూ దళసభ్యుల ఎదుట మొరపెట్టుకున్నారు. దీంతో వారివద్ద ఉన్న మూడు బయోమెట్రిక్ యంత్రాలను స్వాధీనం చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకు విడిచిపెట్టారు. ఒక్కో యంత్రం విలువ రూ.40వేలు ఉంటుంది. మన్యంలో ఉపాధి కూలీలకు చెల్లింపుల్లో అధికారులు విఫలమవుతున్నందున బయోమెట్రిక్ నమోదు వద్దని వారిని హెచ్చరించినట్టు తెలిసింది.
మావోల ప్రజాకోర్టు
Published Mon, Jun 16 2014 2:17 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement