కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆయన బదిలీని తప్పుపడుతున్నాయి. కుల, విద్యార్థి, యువజన సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. సొంత శాఖ ప్రక్షాళనపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఇంటికి పంపేందుకూ వెనుకాడబోనని ఘాటుగా హెచ్చరించారు. పేరు మోసిన ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తూ గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రఘురామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు గాడిలో పడ్డాయి.
రౌడీలు, ఫ్యాక్షనిస్టుల్లో వెన్నులో వణుకు పట్టించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ప్రజల్లో నమ్మకం కల్పించారు. మీతో మీఎస్పీ కార్యక్రమం ప్రవేశపెట్టి ఆపన్నులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత స్వార్థానికి ఆయనకు బదిలీ కావడం పట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి అధికారులను కాపాడుకోవాల్సింది పోయి ఈ తీరున వ్యవహరించడం తగదన్నారు. నంద్యాలలోనూ వివిధ ప్రజా సంఘాలు ఎస్పీ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి.
ఎన్నడూ లేని విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని బన్ని ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల రక్షణకు మొదటి సారిగా హెల్మెట్లు కూడా ఆయన పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఇదిలాఉండగా తన బదిలీని నిలిపివేయాలంటూ ఎస్పీ రఘురామిరెడ్డి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్ విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్) రఘురామిరెడ్డి బదిలీని నిలిపివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం కొందరు పోలీసు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
రఘు‘రాముడే’
Published Tue, Oct 29 2013 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement