అమరావతి : ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవడానికి వచ్చిన సందర్శకులతో శుక్రవారం అసెంబ్లీ లాబీలు కిక్కిరిసి పోయాయి. ఓ వైపు సభ జరుగుతుండగా జగన్ ను కలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన చాంబర్ ముందు గుమికూడారు. జగన్ తన చాంబర్‌లో ఉండగా బయటకు వస్తే కలుద్దామని వేచి ఉన్నారు. జగన్ వ్యక్తిగత సిబ్బంది వారందరినీ వరుసగా కలిపే యత్నం చేస్తుండగా అసెంబ్లీ ప్రధాన భద్రతాధికారి అక్కడకు వచ్చి ‘ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు...’ అంటూ అందరినీ గద్దించి పంపేశారు.
చాలా మందిని అసెంబ్లీ ఆవరణను దాటించే వరకు వదల్లేదు. ఎంతో ఆశతో జగన్‌ను కలుద్దామని వచ్చిన సందర్శకులు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి జగన్ అసెంబ్లీకి వచ్చినపుడల్లా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు ప్రతిరోజూ ఆయన్ను కలవడానికి తాపత్రయపడుతున్నారు. అసెంబ్లీ ముగియగానే అదే పనిగా వేచి ఉండి ఆయనను కలిసే వెళుతున్న సందర్భాలు రోజూ జరుగుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు, ఇతర అసెంబ్లీ సిబ్బంది కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ హడావిడి కొనసాగుతోంది.
అయితే శుక్రవారం అసెంబ్లీ చివరి రోజు కావడంతో సందర్శకుల రద్దీ మరితంగా పెరిగింది. చాలా మంది సెల్ఫీలు తీసుకుందామని ఆసక్తిని చూపారు. ఇలా ప్రజలు జగన్ కోసం అసెంబ్లీకి రావడం అధికారపక్షానికి కంటగింపుగా తయారైందట. అసెంబ్లీలో ఏ నేతకు కూడా లేని విధంగా ఇంత మంది సందర్శకులు జగన్ కోసం రావడం చూసి, వెంటనే భద్రతా సిబ్బందికి పురమాయించిన కారణంగానే వారందరినీ బయటకు పంపేశారని చెబుతున్నారు.