అచ్చంపేట, న్యూస్‌లైన్ : పులిచింతల ప్రాజెక్టు ప్రారంభానికి విభజనవాదుల భయం వెంటాడుతోంది. ప్రారంభానికి వచ్చే ముఖ్యమంత్రిని అడ్డుకునేందుకు వారు వ్యూహం పన్నుతున్నట్లు పసిగట్టిన అధికారులు ప్రారంభోత్సవాన్ని నల్లగొండ జిల్లా నుంచి గుంటూరు జిల్లా వైపునకు మార్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తుండటం, నల్లగొండ జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకపోవడం, ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభానికి పూనుకోవడం తదితర కారణాలుగా భావిస్తున్నారు. కాగా, మొత్తం 24 క్రస్ట్‌గేట్లకుగాను ఇంకా అయిదు గేట్ల నిర్మాణం మిగిలి ఉంది.