గుంటూరు సాయిభాస్కర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తున్న వైఎస్ (ఫైల్)
‘ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఆయన. ప్రజాకాంక్షకు తగ్గట్టు పాలన అందించిన మహానేత. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి పల్లె కన్నీరు తుడిచిన మనసున్న మారాజు.’’ ఆయనకు గుంటూరు జిల్లాతో విడదీయ రాని అనుబంధం ఉంది. తండ్రిబాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు అందించే ప్రణాళికను ప్రకటించారు. నిరుద్యోగులకు గ్రామ వలంటీర్‌లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జిల్లాలో వేలాది ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొన్నారు.
సాక్షి,అమరావతి : జిల్లాపై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు. పులిచింతల ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి డెల్టాను సస్యశ్యామలంగావించారు. ఆరోగ్యశ్రీకి ఈ జిల్లాలోనే అంకురార్పణ చేశారు. పేదోడు తలెత్తుకుని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది మహానేత హయాంలోనే. రైతుల బతుకు చిత్రాన్ని మార్చే క్రమంలో ఆయన 1.50 లక్షల కోట్ల రూపాయల అంచనాతో జలయజ్ఞం కింద రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు చేపట్టారు. వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. కావడం గమనార్హం.
రాజ్యం మేలు కోరిన పాలకుడు
తెనాలి: వైఎస్సార్ సీఎంగా పగ్గాలు చేపట్టాక తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిన పులిచింతల రిజర్వాయరుకు శంకుస్థాపన చే శారు. బహిరంగసభను తెనాలిలో నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను కృష్ణానదికి రప్పించి, డెల్టా ప్రాంతానికి నీటికరువు లేకుండా చేస్తావుని ప్రకటించారు. అయిదేళ్లలో పులించింతలను సాకారం చేశారు. పోలవరం పనుల్లోనూ పురోగతిని సాధించిన విషయం తెలిసిందే.
2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక డెల్టా ప్రాంతంలో రెండు పంటలకు నీరిస్తావుని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక అయిదేళ్లూ ఆ మాటను నిలబెట్టుకుంటూ వచ్చారు. అంతుకు ముందెన్నడూ లేనివిధంగా 2008లో 2.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసిన మెుక్కజొన్న పైరుకు 2009 ఏప్రిల్ వరకు సాగునీరిచ్చి సహకరించిన వైనాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
ఇందిరమ్మ పథకం ఫేజ్–2 ఆరంభానికి అప్పటి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని రప్పించటమే కాకుండా Üమీపంలోని కొల్లిపర మండలం తూములూరులో శంకుస్థాపన చేయించారు. గుంటూరు–హనువూన్‌పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రామం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండు లైన్ల సిమెంటు రహదారి, రూ.112 కోట్లతో కృష్ణా కుడి వరదకట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఇక్కడ నుంచే ప్రారంభించారు.
గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్‌పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే, మరో ఏడాదికల్లా కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్‌పై 17 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మింపజేశారు. తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాలను 2009 జనవరి 28న వచ్చిన వైఎస్ ప్రారంభించారు. యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం ఉచితంగా పక్కా గృహాల నిర్మాణానికి ప్రత్యేకంగా జీవో ఇప్పించారు. చంద్రబాబునాయుడు కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో 3 వేల మంది కళాకారులకు రూ.200 పింఛనును అందిస్తున్నారు. అప్పటికింకా 21 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వైఎస్ దృష్టికి ఈ విషయం రాగానే కళాకారుల 21 నెలల బకాయిలు చెల్లించేశారు. పింఛను మొత్తాన్ని రూ.500 చేశారు. అప్పటి వరకు ఉన్న 3 వేల మందికి అదనంగా మరో 7 వేల మందికి పెన్షన్లను మంజూరు చేశారు.
నెరవేరిన పులిచింతల కల
గుంటూరు, కృష్ణా జిల్లాలకు పులిచింతల ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. విజయవాడ, గుంటూరు నగరాల తాగు నీటి అవసరాలు తీర్చడంతోపాటు, కృష్ణా పశ్చిమ డెల్టాను సస్యశ్యామలం చేస్తుంది. ప్రాజెక్టు సామర్థ్యం 47.45 టీఎంసీలు. తరువాత ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. 2013లో ప్రాజెక్టుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం పులిచింతల నిర్వాసితులకు సంబంధించి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిలువ చేయకుండా కిందికి విడుదల చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీలకుపైగా నీటిని నిల్వ చేశారు. ఈ నీరుతో కృష్ణా తూర్పు, పశ్చిమ ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. గుంటూరు, విజయవాడ నగరాలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా పోయింది.
నాగార్జున సాగర్, జవహర్ కాలువల ఆధునికీకరణ పనులు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 2008లో రూ. 4444.4 కోట్లతో పనులను చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే గుంటూరు జిల్లా పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువ ఆధునికీకరణ పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు సాగాయి. కుడికాలువ పరిధిలో లైనింగ్ పనులను చేపట్టారు. ఈ పనులను 2018 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు రూ. 2,832.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 48 శాతం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతంగా ఉంది. డాలరు మారకపు విలువతో రూ.900 కోట్ల నిధులతో కాలువల అధునికీకరణ పనులు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గడువు ముగుస్తున్న తరుణంలో హడావిడిగా కేవలం రూ.400 కోట్లతో మాత్రమే పనులు చేపట్టారు..
జిల్లాపై ఎనలేని మమకారం
జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్ అధిక ప్రాధాన్యాన్ని కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులను కేటాయించటంతోపాటు పథకాల అమల్లో పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన 12 వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులకు రూ.560 కోట్ల మేర రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభ జిల్లాలో ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాటలతో ఎన్నో గ్రామాలకు దాహార్తిని తీర్చారు. గుంటూరు నగరానికి దాహార్తి తీర్చేందుకు రూ 6.50 కోట్లతో తక్కెళ్ళపాడు రా వాటర్ ప్లాంటు నుంచి తక్కెళ్ళపాడు నీటి శుద్ధి ప్లాంటు వరకు రెండో పైప్‌లైన్ నిర్మించారు. విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్ పథకం ద్వారా లక్ష మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.
తెనాలిలో తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన (ఫైల్)
ఐదేళ్లలో 57 సార్లు పర్యటన:
ఏ సీఎం తిరగని రీతిలో ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నంగా నిలిచిపోయిన పులిచింతల ప్రాజెక్టును 2004 అక్టోబర్ 15న రూ.682 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించటం జిల్లా చరిత్రలో మర్చిపోలేని విషయం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు జిల్లాలోనే అంకురార్పణ చేశారు.
జలయజ్ఞం పనులతో రూపు రేఖలు మార్చిన మహానేత...
దివంగత మహానేత డాక్టర్ వైఎస్,రాజశేఖరరెడ్డి జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో జలయజ్ఞం పథకం కింద పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్, జవహర్ కాలువల∙ఆధునికీకరణ పనులు, కృష్ణా,పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. మొత్తం మీద నీటిపారుదల రంగానికి దాదాపు రూ. 6వేల కోట్లు జలయజ్ఞం పనులు చేసి జిల్లా రూపు రేఖలనే మార్చారు.
కృష్ణా పశ్చిమ డెల్టా
గుంటూరు జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనుల కోసం 2008లో వైఎస్సార్ రూ. 835.33 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో రూ. 390.83 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాలువల అధునికీకరణ పనులు జరగని దుస్థితి నెలకొంది. తెనాలిలో నగరబాటలో భాగంగా 2008 జనవరిలో రూ. 97 కోట్ల విలువైన రక్షిత మంచినీటి పథకానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఇందిరప్రభ ద్వారా 13 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. రాజీవ్ పల్లెబాట కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో చేపట్టిన పనులు ప్రజల మదిలో నిలిచిపోయాయి.
ఆరోగ్యశ్రీకి మళ్లీ మంచి రోజులొచ్చాయి
ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. చరిత్ర సృష్టించే విధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించి ఎందరికో ప్రాణదానం చేశారు. తిరిగి నేడు ఆయన బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పథకానికి జీవం పోశారు. వీరిద్దరి పాలనలోనే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలు జరుగుతోంది. నాడు మహానేత నేడు ఆయన తనయుడు ప్రజా నాయకులుగా నిలిచిపోయారు.
– కేసరి నర్సింహా రెడ్డి, నకరికల్లు
ఇంత మొత్తంలో ఉద్యోగాల కల్పన ఇదే తొలిసారి
ఉపాధిమార్గం కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని విశ్వసించే ముందుచూపున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. అప్పట్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భారీగా ఉద్యోగాలను కల్పించి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపారు. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉపాధినిస్తున్నారు. ఇంతస్థాయిలో ఉద్యోగాలు కల్పించడమనేది చరిత్రలో అరుదైన ఘట్టం. ఇదే సమయంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకుంటున్నారు.
– షేక్.హుస్సేన్, నకరికల్లు
రాజన్న దయ వల్లే నాకు పునర్జన్మ
నా పేరు గుంటూరు భూలక్ష్మి. నా భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పని చేస్తుంటాడు. కుమారుడు రాజేష్ సెల్ మెకానిక్ చేస్తుండగా, నా కుమార్తె నాగజ్యోతి పీజీ విద్యనభ్యసించడంతో వివాహం చేశాం. నాకు గుండెల్లో నొప్పి రావడంతో ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించా. గుండె ఆపరేషన్ చేయాలని లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని బతికి బయట పడ్డా. రాజన్న వల్లే నేను ప్రాణాలతో ఉన్నా. నాకు ఆపరేషన్‌తోపాటు ఆరోగ్యశ్రీ ద్వారానే ఇంటికి వెళ్లడానికి చార్జీలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించారు. నా కుమార్తె ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పీజీ చదివింది. పక్కా గృహాన్ని రాజన్న హయాంలోనే నిర్మించుకున్నా.
– గుంటూరు భూమలక్ష్మి, సాలిపేట, సత్తెనపల్లి
అన్నదాతకు భరోసా ఇచ్చారు
నా పేరు బాపతు శివారెడ్డి. నా భార్య వెంకాయమ్మ. నాకు నందిని, నాగలక్ష్మి, నాగజ్యోతి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాకు 2.25 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. పంటలు పండక అప్పులపాలు కావడంతో పొలం అమ్మకానికి పెడు తున్న తరుణంలో రాజశేఖరరెడ్డి రైతుల రుణాలు మాఫీ చేశారు. ఆ సమయంలో నాకు రూ. 90 వేలు రుణమాఫీ అయ్యింది. అంతేగాక నా కుమార్తె నందిని డిగ్రీ, నాగలక్ష్మిని పీజీ, నాగజ్యోతిని ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదివించాను. రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన హయాంలోనే పక్కా గృహం నిర్మించుకున్నా. అన్నదాతలను ఆదుకున్న మహానేత రాజశేఖరరెడ్డిని ఎప్పటికీ మరిచిపోలేం.
– బాపతు శివారెడ్డి, శాలివాహననగర్, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment