పులికాట్‌ను మింగేస్తున్న కాలుష్య భూతం | Pull Pollution In Pulicat Lake In Nellore | Sakshi
Sakshi News home page

పులికాట్‌ను మింగేస్తున్న కాలుష్య భూతం

Published Thu, Aug 23 2018 8:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Pull Pollution In Pulicat Lake In Nellore - Sakshi

ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని పన్నంగాడు సమీపంలో రొయ్యలు సాగు

ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి.. అందాల తీరంగా ఉన్న పులికాట్‌.. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో సహజత్వానికి దూరమవుతోంది. జీవవైవిధ్యాన్ని కోల్పోతోంది. మత్స్య సంపద తగ్గిపోతోంది. సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటం వల్ల మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతుంది. వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో సెలైనిటీ శాతం 65 శాతం దాటిపోతోంది. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉత్పత్తి ఐదువేల టన్నుల నుంచి రెండువేల టన్నులకు పడిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని మత్స్యకారులు జీవన పోరాటం చేస్తున్నారు. 

సూళ్లూరుపేట (నెల్లూరు) : ఆంధ్రా – తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్‌ సరస్సు తీరప్రాంతంలోని మత్స్యకారులు నిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 20 వేలకు మందికి పైగా మత్స్యకారులు చేపలవేటే ప్రధానవత్తిగా జీవనం సాగిస్తున్నారు. అంటే దాదాపుగా 20 వేల మందికిపైగా సరస్సు అన్నం పెడుతోంది. 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. గతంలో సుమారు 3 వేల నుంచి 5 వేల టన్నులు చేపలు, రొయ్యలు, పీతలు పట్టేవారు. ప్రస్తుతం రెండు వేల టన్నులు మత్స్యసంపద మాత్రమే దొరుకుతున్నట్లు జాలర్లు లెక్కలు చెబుతున్నాయి.

సరస్సు జీవవైవిధ్యాన్ని కోల్పోయి కాలుష్యకోరల్లో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోతుండటంతో మత్స్యసంపద కూడా నానాటికి తగ్గిపోతూ వస్తోంది.  వర్షాలు బాగా కురిసినప్పుడు నదులు, కాలువల నుంచి వచ్చే మంచినీరు, సముద్ర ముఖద్వారాల నుంచి వచ్చే ఉప్పునీరు కలవడంతో ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో పులికాట్‌ సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటంతో మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతోంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో వర్షాభావంతో మంచినీళ్లు సరస్సుకు చేరడంలేదు. కేవలం ఉప్పునీళ్లు మాత్రం ఉండటంతో సెలైనిటీ 65 శాతం పైగా దాటి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో మత్స్య సంపద వృద్ధి చెందడం లేదని జాలర్లు అంటున్నారు.

తరచూ వివాదాలే..
 సరస్సులో నీరు తగ్గినప్పుడల్లా సరిహద్దు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ç1983 సంవత్సరం నుంచి వివాదాలున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తరంవైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారింది. దీంతో మన రాష్ట్రానికి చెందిన జాలర్లు ఇక్కడ మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో మత్స్య సంపద దొరుకుతుండటంతో అక్కడికి వెళుతున్నారు. అయితే ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలలు ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారు.
 
 పులికాట్‌ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులు చూపించమని 1989 నుంచి మత్స్యశాఖ అధికారులు, అందుకు సంబంధించిన మంత్రుల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన జాలర్లు సరిహద్దు వివాదాలతో కుమ్ములాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 1989లో రెండు రాష్ట్రాల మధ్య జాలర్లకు భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. అటు తర్వాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రం ఎంత ఉంది?, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? అనే అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా చెల్లించారు. 1994లో సర్వే చేయాలని మన రాష్ట్ర అధికారులు సిద్ధమవగా తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో ఆగిపోయింది. తర్వాత ఈ వివాదం తరచుగా కొనసాగుతూనే ఉన్నా 2007లో రెండు రాష్ట్రాల మత్స్య శాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలు కార్యరూపంలోకి రాకపోవడంతో వివాదం ఇంకా ఉంది.

పూడికతీత పనులు గాలికి..
తమిళనాడులోని పల్‌వేరికాడ్‌ ముఖద్వారాన్ని ప్రతిఏటా ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల దక్షిణ భాగం సరస్సు ఎప్పుడూ జలకళతో ఉంటుంది. వాకాడు మండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకుపోవడంతో వేసవి కాలంలో ఉత్తరవైపు సరస్సు ఎడారిలా మారింది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలకు పూడిక తీయించాలని ఆందోళనలు చేశారు. దీనిపై 2007లో కేంద్ర డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్, ఓషన్‌ టెక్నాలజీ అధికారులు, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు వచ్చి ముఖద్వారాలను పరిశీలించారు.

2007లో మెరైన్‌ ప్రదేశాల యాజమాన్య సంస్థ దీనిపై బేస్‌లైన్‌ సర్వే చేసింది. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లతో అంచనాలు వేసి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. అయితే దీనికి సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇందులో మొదట విడుతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేనెలలో స్థానిక పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీని తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక మాట కొండెక్కేసింది.

పరిశ్రమల కాలుష్యంతోనే..
తమిళనాడు పరిధిలో ఎళ్లావూరు, గుమ్మిడిపూండి, తడమండలం ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు పెరిగిపోయి ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీల నుంచి వ్యర్ధాలుగా వచ్చే నీళ్లు, కాలుష్యం సరస్సుకు వదిలేయడంతో సహజత్వాన్ని కోల్పోతూ వస్తోంది. అదే వి«ధంగా ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పన్నంగాడు సమీపంలో అధికంగా రొయ్యల సాగు చేస్తున్నారు. తీరప్రాంతానికి సుమారు 5 కిలోమీటర్లు మేర రొయ్యలసాగు చేయకూడదనే నిబంధన ఉన్నా వాటిని తమిళనాడుకు చెందిన వారు పట్టించుకోకుండా రొయ్యలు సాగు చేస్తున్నారు. మడఅడవులు అంతరించిపోవడంతో సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయిందని జాలర్లు చెబుతున్నారు.

అదే విధంగా శ్రీహరికోట దీవిలో రాకెట్‌ కేంద్రం ఏర్పాటుతో సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు పులికాట్‌ సరస్సును రెండుగా చీల్చి రోడ్లు వేయడంతో దీని సహజత్వం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత ప్రజావసరాల నిమిత్తం పేరుతో దొరవారిసత్రం మండలం వేలికాడు, కారికాడుకు రోడ్డు, తడమండలం వేనాడు,  సూళ్లూరుపేట మండలం పేర్నాడు, చిట్టమూరు మండలంలో కూడా పలు దీవులకు సరస్సులోనే రోడ్లు వేయడంతో ఉత్తరం వైపు సరస్సు ఐదు చీలికలుగా మారింది. దీంతో ఉత్తరం వైపు భాగమంతా ఎడారిని తలపించే విధంగా ఎండిపోతోంది. దక్షిణం వైపు సరస్సు మాత్రం ఇప్పటికి  నీళ్లు తగ్గినా నిండుగా కనిపిస్తుంది. దీంతో జాలర్లకు చేతి నిండా పనిలేకుండా పోయింది. చేపల వేటకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా వారు ప్రత్యామ్నాయ ఉపాధివైపు అడుగులు వేస్తున్నారు.

ఆంధ్రా జాలర్లుకు భృతి అందించాలి
పక్కపక్కనే ఉన్న తమిళనాడు పరిధిలో పులికాట్‌ జాలర్లకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వేటలేని సమయంలో జీవనభృతి కోసం రూ.4 వేలు నగదుతో పాటు నిత్యావసరాలు కూడా అందుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రా జాలర్లుగా ఉన్న మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. గతేడాది నుంచి కరువు పరిస్థితుల నేపథ్యంలో వేటలేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పస్తులతో కాలయాపన చేస్తున్నారు. 
 : స్వామి, కాశింకాడుకుప్పం 

మహిళల సంపాదనతో.. 
ప్రస్తుతం పులికాట్‌ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోవడంతో మూడురోజుల పాటు వేటసాగించినా పూటగడవడం లేదు. రొయ్యలు, పీతలు కోసం ఎన్నిరోజులు వలలువేసినా దొరకడం లేదు. దీంతో మా ఆడవాళ్లు తమిళనాడులోని పల్‌వేరికాడ్‌ నుంచి పచ్చిచేపలు, చెన్నై నుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. పులికాట్‌ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట – పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా సరస్సులో సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. -కేసీ రమేష్, భీములవారిపాళెం కొత్తకుప్పం  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వాకాడు మండలంలో రాయదొరువు ముఖద్వారం వద్ద పేరుకుపోయిన పూడిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement