అవినీతి ఘాటు!
పోపుల ఖర్చులో అవినీతి జాడ్యం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో భారీగా వసూళ్లు విడుదలైన సొమ్ములో ఆర్థిక భారమున్నా.. జీతాలు లేకున్నా.. అప్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించిన అంగన్‌వాడీలు పెట్టుబడిని రాబట్టడానికి ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నా వెన్ను చూపకుండా ఎదురొడ్డి పోరాడారు. ఫలితంగా నాలుగు నెలల జీతాలతో పాటు పోపుల ఖర్చుకింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 3403 కేంద్రాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సగం మాత్రమే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఆశాఖ అధికారులు మిగిలిన సగానికి చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు మహిళా శిశు సమగ్రాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టుల పరిధిలో 3,403 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అలాగే 789 మినీ అంగన్‌వాడీలు, 3403 న్యూట్రిషన్ కౌన్సిల్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఒకటి నుంచి ఆరు నెలల లోపు చిన్నారులు 23,739 మంది, ఆరు నెలల నుంచి ఏడాది లోపు 22,404 మంది చిన్నారులు, ఏడాది నుంచి ఠమొదటిపేజీ తరువాయి
మూడేళ్ల వయసున్న వారు 81,066 మంది, మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు 59,784 మంది పిల్లలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఏడాది నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు మాత్రమే పౌష్టికాహారం అందిస్తారు. ఒక్కో చిన్నారికి 95 పైసలు వంతున పోపుల కోసం ప్రభుత్వం ప్రతిరోజూ చెల్లిస్తోంది. అయితే గత ఎనిమిది నెలలుగా పోపులసొమ్ము విడుదల చేయక పోవడంతో అంగన్‌వాడీలు ఆందోళన బాటపట్టారు. ఇతర సమస్యలతో పాటు పోపుల నిధులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి పోపుల కోసం ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లిస్తూ ఇటీవల నిధులు విడుదల చేయడంతో అంగన్‌వాడీ ఆనందపడ్డారు. అయితే ఇదే అదునుగా భావించిన ఐసీడీఎస్ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పోపుల సొమ్ముల్లో సగం ప్రాజెక్టుల్లోని వారే కత్తిరించి మిగిలిన సొమ్ము కార్యకర్తలకు అందజేశారు.
చేతివాటం రూ.5 లక్షల పైనే..
అంగన్‌వాడీల నుంచి పోపుల సొమ్ములో ప్రాజెక్టుల వారీగా వసూలు చేసిన మొత్తం రూ.5 లక్షల పైనే ఉంది. నెలకు 1.39 లక్షల మంది పిల్లలకు తల ఒక్కింటికీ ప్రభుత్వం రోజుకి 95 పైసలు చొప్పున నెలకు రూ.1.35 లక్షలు విడుదలైంది. ఎనిమిది నెలలకు గాను 18 ప్రాజెక్టుల్లో రూ.10.52 లక్షలు విడుదలైతే అందులో అంగన్‌వాడీ కార్యకర్తలకు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే చెల్లించిన అధికారులు మిగిలిన సొమ్మును మింగేశారు. ఇదేంటని అడిగితే జీతాలు బిల్లులు చేశామని.. ట్రెజరీ సిబ్బందికి పర్సంటేజీలంటూ ఐసీడీఎస్ సిబ్బంది సమాధానం చెబుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డేటా నావద్దలేదు
అంగన్‌వాడీ కార్యకర్తలకు పోపుల వ్యయంతోపాటు జీతాల సొమ్ము ఇప్పటికే విడుదలైంది. ఈ నిధులు ప్రాజెక్టులకు పంపించడం జరిగింది. ఎంతెంత వచ్చిందో డేటా మాత్రం ప్రస్తుతం నావద్దలేదు. నరసన్నపేట మీటింగ్‌లో ఉన్నా..అవినీతి గురించి నాకు తెలియదు.
- చక్రధర్‌రావు, ఐసీడీఎస్ పీడీ