ఎందుకో.. ఇవెందుకో
- పుష్కరాల పేరిట రూ.కోట్లు వృథా
- అక్కరకు రాని నిర్మాణాలు
- యాత్రికులకు ఉపయోగపడని విశ్రాంతి షెడ్లు
- తమ్ముళ్ల జేబుల్లోకి పుష్కర నిధులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కొవ్వూరు పట్టణానికి పుష్కర యాత్రికులు లక్షలాదిగా పోటెత్తి వస్తున్నారు. కనీస వసతి సౌకర్యాలు లేక రోడ్లు, పేవ్‌మెంట్లపై నిద్రిస్తున్నారు. అలాగని వారికోసం ఏర్పాట్లేమీ చేయలేదనుకుంటే తప్పులో కాలేసినట్టే. యాత్రికుల కోసం షెడ్లు వంటివి నిర్మించినా అవి వారికి అక్కరకు రావడం లేదు. వందలాది కోట్ల రూపాయల పుష్కర నిధులను కాంట్రాక్టర్ల ముసుగులో అంది నంత దోచుకున్న తెలుగుతమ్ముళ్లు కనీసం ఆ నిర్మాణాలను యాత్రికులకు ఉపయోగపడే విధంగా చేపట్టలేదు.
పుష్కరాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నా ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు, ప్రాజెక్టులు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. కేవలం కాంట్రాక్టుల పేరిట సొమ్ము చేసుకునేందుకే ఆ పనులు చేపట్టడం వల్ల కనీసమాత్రం కూడా పుష్కర భక్తులకు ఉపయోగం లేకుండా పోయాయి. కొవ్వూరు మునిసిపాలిటీ రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయంటే.. అవి ఎంతదూరంలో ఏర్పాటు చేశారో, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తగిన చోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించకపోవడం ప్రధాన సమస్య కాగా, అక్కడ అరకొర వసతులు కల్పించి చేతులు దులుపుకోవడంతో ప్రజాధనం వృథా అయింది. ఘాట్లకు, పట్టణానికి సమీపంలోని ప్రదేశాలను విస్మరించి అక్కరకు రాని స్థలాల్లో షెడ్లు నిర్మాణం చేయడం వల్ల గడచిన వారం రోజుల్లో కేవలం పదుల సం ఖ్యలో భక్తులు మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు.
కొవ్వూరు పట్టణంలోని పాత బైపాస్ రోడ్డు, పుష్కరనగర్, ఆంధ్రా షుగర్స్ కర్మాగారాల మధ్య మొత్తం మూడు ప్రదేశాల్లో ప్రయాణికుల విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ప్రయాణికులు బస చేసేందుకు అనువుగా షెడ్లలో ఫ్యాన్లు, లైట్లతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, సామాన్లు భద్రపరుచుకునే లాకర్లు, జనరేటర్ సదుపాయం వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఏ ఒక్కచోట పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ షెడ్లు యాత్రికులకు అక్కరకు రావడం లేదు. కానీ.. ఈ నిర్మాణాల పేరిట కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ నేతల జేబులు మాత్రం నిండిపోయాయి.
ఎవరి కోసం ఆ కార్యక్రమాలు
కొవ్వూరు పట్టణంలో శివారు ప్రాంతమైన హేవలాక్ బ్రిడ్జి పక్కన రైల్వే స్థలంలో సమాచార పౌర సంబంధాల శాఖ భారీఎత్తున ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఎవరి కోసం.. ఎందుకోసం అన్న ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు. మొత్తం సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు, ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలతో ఓ ఇంటి మాదిరిగా నిర్మించిన స్టాల్ పేరిట రూ.లక్షలు ఖర్చు చేశారు.
స్టాల్ నిర్మాణం కోసం స్థలాన్ని చదును ఖర్చులకే పెద్దమొత్తంలో ఖర్చయ్యింది. జనాలు రానిచోట ఆ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశారన్న దానిపై అధికారులు నోరు మెదపడం లేదు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఇదే స్థలంలో ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలు కనీసం పట్టుమని పదిమంది వీక్షకులు కూడా లేక వెలవెలబోతున్నాయి. అక్కడ స్థలంలో తుప్పలు తొలగించి, మెయిన్ రోడ్డు నుంచి కళావేదికకు అప్రోచ్ రోడ్డు వేసేందుకు టీటీడీకి రూ.మూడు లక్షలు, మునిసిపాలిటీకి మరో రూ.3 లక్షలు ఖర్చయ్యాయి.
నిత్య కార్యక్రమాల నిర్వహణ, ఇతరత్రా ఏర్పాట్లకు చాలా వ్యయమవుతోంది. కానీ అక్కడ ధార్మిక వ్రవచనాలు, భజనలు, భక్తి సంగీతాలు, హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు. ‘ఇక్కడ కళాకారులం మేమే.. ప్రేక్షకులం కూడా మేమే..’ అని టీటీడీకి చెందిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల పుష్కర నిధులను అడ్డగోలుగా ఖర్చు చేశారనేందుకు విశ్రాంతి షెడ్లు, సమాచార పౌర సంబంధాల శాఖ స్టాల్, టీటీడీ కళావేదికలు కళ్ల ముందు కనపడుతున్న ఉదాహరణలు.