అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
ధర్మవరంటౌన్, న్యూస్‌లైన్: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో జిల్లాలో 7లక్షల రేషన్‌కార్డులు ఉండగా, తాము అధికారం చేపట్టినప్పటి నుంచి 11.5 లక్షల రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు.
గతంలో 97వేల పింఛన్లు ఉండగా, ప్రస్తుతం తాము 5.19 లక్షల పించన్లు ఇస్తున్నామని, 6లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యేవరకు వారికి అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరించేలా బంగారు తల్లి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 30వేల రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని 15 నుంచి 30వ వార్డులకు సంబందించిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, మెప్మా పీడీ నీలకంఠారెడ్డి, ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంపీడీఓ భాస్కరరెడ్డిలతోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.