తెలుగులో ఖురాన్
రంజాన్ స్పెషల్
మొదటిసారి సరళీకరించిన కంభం వాసి
ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు.
ఎవరీ గఫూర్
ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూల్ ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో ఆయన నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించారు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాశారు. 1948 నాటికి పుస్తకం ముద్రించారు.
మరికొన్ని గ్రంథాలు
గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను కూడా రచించారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కాకు వెళ్లారు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు.
కోట్లాది మంది కంఠస్తం చేసిన ఖురాన్
ఖుర్‌ఆన్ అనే పదం ‘‘ఖిరాత్’’ నుంచి వచ్చింది. ఖిరాత్ అంటే చదవడం, ఖుర్‌ఆన్ అంటే పదేపదే చదవబడే పుస్తకం అని అర్థం. అల్లాహ్ ఈ దివ్యగ్రంధాన్ని జీబ్రాలాల్ దైవదూత ద్వారా అవ తరింపచేశాడు. ఖుర్‌ఆన్‌కు పుర్ఖాన్, హుదా, ఖుష్రా, జిక్రా, ఆల్‌కితాబ్, షిఫా అనే పేర్లు కూడా ఉన్నాయి. ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసినవారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. దివ్య ఖురాన్ మక్కానగరంలో 10 సంవత్సరాలు, మదీనాలో 13 సంవత్సరాల పాటు అవతరించింది. మక్కాలో అవతరించిన అధ్యాయాలను మక్కా అవతరణ అని , మదీనాలో అవతరించిన అధ్యాయాలను మదీనా అవతరణ అని అంటారు.
- కంభం రూరల్
128 మంది నమాజ్ చేస్తున్నారు: డాక్టర్ ఖాసీం అన్వర్: మౌల్వి అబ్దుల్ గఫూర్ తమ్ముడు
మా అన్న మౌల్వి అబ్దుల్ కట్టిన మసీదుకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆయన స్థలాన్ని కొని.. మసీదు కట్టించారు. ప్రస్తుతం ఇక్కడ 128 మందికి పైగా నమాజ్ చేస్తున్నారు. ఆయన పేరు మీద బిలాల్ మసీదులో మదర్సా ఏర్పాటు చేశాడు.