
బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలి: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టాలని, రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కోరారు. సోమవారం సచివాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పార్టీలన్నీ బీసీలకు 150 శాసనసభ, 22 పార్లమెంటు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలన్నారు. యూపీఏ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, పదేళ్ల పాలనలో జాతీయ బీసీ కమిషన్‌కు ఒక్క రాజ్యాంగ హక్కు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. దేశ జనాభాలో 54శాతం ఉన్న బీసీలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 7శాతం మాత్రమే ఉన్నారని, 60 ఏళ్ల స్వాతంత్య్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలకు టికెట్లు ఆమ్ముకునే పార్టీలకు తగిన బుద్ధిచెప్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఈనెల 31 సమావేశం ఏర్పాటు చేయనున్నామని, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం పాల్గొనాలని కృష్ణయ్య ఆహ్వానించారు.