టీడీపీ బీసీ డిక్లరేషన్‌పై బీసీ నేతల మండిపాటు.. సీఎం జగన్‌ను చూసైనా నేర్చుకోవాలని హితవు
బీసీల మేలు కోరిన జగన్ పాలన కొనసాగాలని స్పష్టీకరణ
బాబు–పవన్ గారడీ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు
సాక్షి, అమరావతి: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్లుగా.. ఎన్నికల్లో అవకాశవాదంతో వ్యవహరించే చంద్రబాబును నమ్మేదిలేదని బీసీలు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్నికలు వచ్చి న ప్రతిసారి బీసీలే టీడీపీకి వెన్నెముక అని వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కరివేపాకులా తీసిపారేస్తున్నాడని మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తమను మోసగించిన తీరును బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు.
అలాగే, 2019 ఎన్నికల ముందు కూడా బీసీలకు 119 హామీలను ఇచ్చి న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క హామీనీ సరిగ్గా అమలుచేయలేదన్నారు. ఇక 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరిన బీసీలను ‘ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా’.. అంటూ వేలు చూపించి బెదిరించడంతోపాటు మత్స్యకారులపై కేసులు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేదిలేదని బీసీ నేతలు స్పష్టంచేస్తున్నారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు కనీసం సగం సీట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిన తీరును వారు మరిచిపోలేదు. ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపులో దగా చేయడమే కాకుండా పదవుల కేటాయింపులోను చంద్రబాబు బీసీలను తీవ్రమోసం చేశాడని వాపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెనుకబడిన తరగతులను మరోమారు బురిడీ కొట్టించేందుకు ఆయన చేస్తున్న జిమ్మిక్కులను నమ్మేదిలేదని తెగేసి చెబుతున్నారు.
జగన్‌ను చూసి బాబు నేర్చుకోవాలి
రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు యువకుడైన సీఎం జగన్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి ప్రజలను ఆదుకుని అండగా నిలవాలనే మనస్సు ఉండాలి. అటువంటి మంచి మనస్సు జగన్‌కు ఉంది. చంద్రబాబుకు పేదల గురించి ఆలోచించే మనస్సు ఏ కోశానా లేదు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు తన సొంత సొమ్ము ఇచ్చి నట్లు ఫీలవుతాడు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు మేలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతమేరకు అమలు చేశారో? గమనిస్తే చాలు ఆయన చిత్తశుద్ధి తెలిసిపోతుంది. తాజాగా టీడీపీ ప్రకటించిన డిక్లరేషన్‌లో ఎట్రాసిటీ యాక్ట్ తప్ప మిగతావన్నీ ప్రస్తుతం సీఎం జగన్ అమలుచేస్తున్నవే. సామాజిక న్యాయం అమలులో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు. – డాక్టర్ ఎన్‌వీ రావు, జాతీయ అధ్యక్షుడు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్
నయవంచకులు బాబు.. పవన్‌లను నమ్మం
చంద్రబాబు, పవన్‌లు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ నేతి బీర చందంగా ఉంది. గత డిక్లరేషన్‌నే అటకెక్కించిన నయవంచక బాబు, పవన్ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ అంటే బీసీలు నమ్మరు. వారి పట్ల బాబు, పవన్‌లకు చిత్తశుద్ధిలేదని తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు తేటతెల్లం చేస్తున్నాయి. అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు, ఆలోచనలను అమలుచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. గతంలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లుగా అమలుచేసి చూపించిన సీఎం జగన్ రాష్ట్రంలోని బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేయించి బాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుచేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వారి ఉన్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ కులాల జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment