దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి
బొబ్బిలి: రాజధాని, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పచ్చని భూములు లాక్కోవడం సబబు కాదని, వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని, దానిని పాలకులు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రా అన్నపూర్ణ అని మన రాష్ట్రానికి ఎంతో పేరుందని, దానిని కాపాడుకోవవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని అనంతపురం జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. దానిని ఆధారంగా చేసుకుని వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. సెక్షన్ 8 అమలు చేయడమంటే గవర్నర్ చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టడమేనన్నారు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.