
రాజుపాళెంలో ఇటీవల తహసీల్దార్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
ప్రభుత్వ పథకాల లబ్ధితోపాటు వ్యక్తిగత వివరాలను కూడా టీడీపీ గుప్పెట్లో పెట్టుకుంటోందన్న సమాచారం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు స్వపక్షీయులే దరఖాస్తు చేసినట్లు కుట్రలు పన్నిన సర్కారు మరో మోసానికి తెరలేపింది. అధికార పార్టీ తాజా పన్నాగంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే కుట్రపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి అరాచకానికి దిగిన సర్కారు మరొకటి లేదంటూ నిరసిస్తున్నారు. తమ పార్టీ అధికార యాప్‘ సేవామిత్ర’ ద్వారా కూడా వైఎస్సార్‌సపీ ఓట్ల తొలగింపునకు కుతంత్రం నడుపుతోందని తెలిసి కలవరపడుతున్నారు. అధికార పక్షానికి చెందిన సర్వే బృందాలు జిల్లాలో ఇప్పటికే తిరుగుతున్నాయి. టీడీపీ అధికార యాప్ ‘సేవామిత్ర’ ద్వారా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వివరాలను గోప్యంగా సేకరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు నటిస్తున్నాయి. రకరకాల ప్రశ్నలను సంధిస్తూ ప్రభుత్వ వ్యతిరేకుల్ని గుర్తిస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నవారి వివరాలను సేకరించి యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. తద్వారా వీరి ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం నయవంచనకు పథక రచన చేసింది. తాజాగా బయటపడిన భారీ డేటా స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తక్షణమే దీనిపై లోతుగా విచారించి సర్కారు నైజాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డేటా చౌర్యం చేస్తున్న టీడీపీ కుతంత్రాన్ని జిల్లా ప్రజలు..విపక్షాల నాయకులు ఎండగడుతున్నారు.
సాక్షి కడప : టీడీపీని పరాజయ భయం వెంటాడుతోంది. ఏం చేయాలో పాలుపోక..బలంగా ఉన్న వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక పలు ఎత్తులు వేస్తోంది. విపక్ష ఓట్ల తొలగింపునకు దొంగ దరఖాస్తుల వైనాన్ని జనం మర్చిపోకముందే మరో హైటెక్ కుట్రకు పాల్పడిన వైనం జిల్లా వాసులను నిశ్చేష్టులను చేసింది. సర్వే పేరుతో కష్టసుఖాలు....సంక్షేమ పథకాలతో సంతృప్తిని కనుగుంటూనే.....సర్కారు తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు పూనుకోవడంవైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి....విపక్ష సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్న తీరు సంచలనం రేకెత్తించింది....జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ వాదనకు బలం చేకూరుతోంది. గతంలోనూ సర్వేల పేరుతో కొంతమంది ప్రజల వద్దకు వచ్చి విచారిస్తూ.....పథకాల లబ్దిని కనుగొంటున్నామంటూనే ఓట్లను తొలగిస్తున్నారని పలుచోట్ల గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన సంఘటనలు జరిగాయి.
పులివెందుల పోలీసుస్టేషన్‌లో వైఎస్ వివేకా ఫిర్యాదు
పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించేందుకు కుయుక్తులు చేశారు. అగంతకులు ఆయన ఓటును తొలగించాలని దరఖాస్తు చేసిన వైనం బయటపడింది. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన వైఎస్ వివేకానందరెడ్డి ఓటును సైతం తొలగించడానికి కుట్ర చేశారు. ఈ దారుణ వ్యవహారం నిగ్గు తేల్చాలని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం
నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఓట్లను భారీ ఎత్తున కొల్లగొడితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపించవచ్చని తమ్ముళ్లు పచ్చ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అధినేత నేతృత్వంలో తమ్ముళ్లు చివరి అస్త్రంగా వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కలుసుకుని సుమారు 50 వేల ఓట్ల తొలగింపునకు జరిగిన పథక రచనలో అసలు కథ అంతా టీడీపీ నేతలే నడుపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న మేరకు అనుకూలమైన ఓట్లను ఒకటి, రెండుచోట్ల చేర్పించుకున్న వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలోనూ ఓటరు అనలిస్ట్ అండ్ స్ట్రాటజీ (వాస్ట్) ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బట్టబయలైంది. క్షేత్ర స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులను అనుకూలంగా మా ర్చుకుని ఇష్టానుసారంగా కథ నడిపినట్లు తెలుస్తోంది. ఎక్కడపడితే అక్కడ..ఎలాపడితే అలా.....అనుకూలమైన వారిని చేర్పించుకోవడం, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగించేలా తమ్ముళ్లు ప్రత్యేక వ్యూహం నడిపారు.
సంక్షేమం ముసుగులో సంక్షోభం
ఎన్నికలు దగ్గర పడేకొద్ది సర్కార్ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. సంక్షేమానికి సంబంధించి ఐవీఆర్‌ఎస్ ద్వారా సంతృప్తిగా ఉన్నారా....అసంతృప్తిగా ఉన్నారా....అంటూ వివరాలు సేకరిస్తూనే వ్యక్తిగత డేటా సేకరించి....తర్వాత కుట్రలకు తెర తీస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఏపీకి సంబంధించిన డేటా బట్టబయలైన నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియకు దరఖాస్తులు, వ్యక్తిగత డేటా చోరీ వ్యవహారానికి సంబంధించి ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలువురు యాప్‌ల ద్వారా ఓట్లను కూడా పరిశీలించుకుంటున్నారు. ఏది ఏమైనా హైదరాబాదులో సైబర్ వ్యవహారం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
నకిలీ దరఖాస్తులపై కొరడా
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7 పేరుతో నకిలీ దరఖాస్తులు ఇచ్చిన వారిపై చర్యలకు ఎన్నికల సంఘం సిద్దమైంది. ఆదివారం కడప ఆర్డీఓ మాలోల వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ దరఖాస్తులతో ఫిర్యాదు చేసిన అగంతకులను పట్టుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఆర్డీఓ మాలోల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గట్టెక్కడం కోసం
తెలుగుదేశం నేతలు అడ్డదారుల్లోనైనా గెలవాలని కొత్త ఎత్తుగడలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆఖరుకు ఓట్ల తొలగింపునకూ పూనుకున్నారు. తమ పార్టీమీద మచ్చ పడకుండా......ప్రత్యర్థి పార్టీలోని వారే ఓటు తీసేయాలని కోరినట్లుగా దరఖాస్తు చేస్తూ అంతర్గత చిచ్చుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడంతో ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి తెరచాటు కుట్రలకు శ్రీకారం చుట్టారు. చాపాడు మండలం కుచ్చుపాపలో విచిత్ర పరిస్థితి కనిపించింది. గ్రామానికి చెందిన ఎం.లక్షుమ్మ కొద్దికాలం క్రితం మృతి చెందింది. తాజాగా గ్రామానికి చెందిన 19 ఓట్లు తొలగించాలని లక్షుమ్మ పేరుతో దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ వైఎస్సార్ సీపీ నాయకులతోపాటు కార్యకర్తల ఓట్లు తొలగించాలని పేర్కొనడం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. చివరికి మృతి చెందిన వారి ఆత్మల పేరుతో కూడా దరఖాస్తు చేయడం చూస్తే ‘పచ్చ’ రాజకీయం ఎంత నీచ స్థితికి దిగజారిందో ఇట్టే అర్థమవుతోంది.
గెలిచేందుకు అడ్డదారులు
రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు, లోకేష్ , టీడీపీ నాయకులు అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌వీధిలో పెట్టారు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలి. బాధ్యులను కటకటాల్లో వేయాలి.– మాల్యాద్రి, యర్రశాల. పోరుమామిళ్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment