పాలి‘ట్రిక్స్’ టీడీపీలో ‘రఘు’ కుంపటి
పాలి‘ట్రిక్స్’ టీడీపీలో ‘రఘు’ కుంపటి
Published Mon, Mar 10 2014 2:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
భీమవరం, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో భారతీ య జనతా పార్టీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు తలదూర్చడం జిల్లాలో డెల్టా రాజకీయాలను వేడెక్కిస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటుందనే అంచనాతో బీజేపీలో చేరిన రఘురామకృష్ణంరాజు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే ఆయన బీజేపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతగా చెలామణి అవుతున్నా టీడీపీలో ఉన్నట్టే ఆ పార్టీ రాజకీయాలను శాసిస్తున్నారని సమాచారం. నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తరఫున పోటీచేసే నాయకులు తనకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో రకరకాలుగా పావులు కదుపుతున్నారని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. దీనిలో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చాలని చంద్రబాబుపై రఘురామకృష్ణంరాజు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలకు తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వేరే పార్టీ వ్యక్తి తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. ఇందుకు చంద్రబాబు వంత పాడటం వారికి మింగుడు పడటం లేదట.
శివ వర్గం కన్నెర్ర
ఉండి ఎమ్మెల్యే సీటును తన అనుయాయుడైన యండగండి గ్రామానికి చెందిన పీవీఎల్ నర్సింహరాజుకు ఇప్పించేందుకు రఘురామకృష్ణంరాజు ఎడతెరపి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు చెక్‌పెట్టి, తన మిత్రుడైన నర్సింహరాజుకు సీటు ఖరారు చేయించేందుకు చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నర్సింహరాజును ఆగమేఘాల మీద హైదరాబాద్ పిలిపించి శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించడంతో ఉండి టీడీపీ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. దీనిపై ఎమ్మెల్యే శివ వర్గం రఘురామకృష్ణంరాజుపై కారాలు మిరియాలు నూరుతోంది.
దేశం నేతల గగ్గోలు
భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (కాంగ్రెస్)ను సైతం టీడీపీలో చేర్పించి టికెట్ ఇప్పించేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో భీమవరంలో ఆది నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న దేశం నేతలు లబోదిబోమంటున్నారు. తాడేపల్లిగూడెంలో కూడా తన స్నేహితుడైన ఓ మాజీ ఎమ్మెల్యేను టీడీపీ తరఫున బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇలా నర్సాపురం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు వర్గాన్ని ఏర్పాటుచేసుకోవడంతోపాటు అక్కడి రాజకీయాలను శాసిస్తుండటం చర్చనీయాంశమైంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్నాళ్లూ పార్టీని నడిపిన వారిని పక్కన పెట్టేలా ఆయన చేస్తున్న రాజకీయాలు టీడీపీలో గందరగోళానికి తెరలేపుతున్నాయి.
ఖర్చంతా భరిస్తారట..!
అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుయాయులు, మిత్రులకు సీట్లు కేటాయిస్తే వారి నిమిత్తం అయ్యే ఎన్నికల ఖర్చును పూర్తిస్థాయిలో తానే భరిస్తానని చంద్రబాబుపై రఘురామకృష్ణంరాజు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీంతో రఘురామకృష్ణంరాజు మాట చంద్రబాబు కాదనలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు బీజేపీ నాయకుడిని అనే విషయాన్ని మరచిపోయి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు.
Advertisement