
‘ఏపీలో విచ్చలవిడిగా అవినీతి దందా’
విజయవాడ: శాసనసభా సమావేశాలను కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానంతో పాటు అఖిలపక్ష నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని కోరారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దందా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఇష్టానుసారంగా అంచనాలు పెంచేసి దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతోందని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.