
'ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం'
హైదరాబాద్:జాతీయ భూసేకరణ చట్టానికి విరుద్ధంగా సీఆర్డీఏ బిల్లును రూపొందించారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు.ఆ బిల్లు వ్యవహారంలో చంద్రబాబు సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని వెయ్యి ఎకరాలు సరిపోతాయని.. 35 వేల ఎకరాలు అవసరం లేదని ఈ సందర్భంగా రఘువీరా స్పష్టం చేశారు. ఏటా వెయ్యి కోట్ల విలువైన మూడు పంటలు పండే ప్రభుత్వం లాక్కుంటే ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో బహుళ అంతస్థులు నిర్మించడం సరికాదనేది నిపుణుల అభిప్రాయంగా రఘువీరా పేర్కొన్నారు. ఒకవేళ అలా నిర్మిస్తే అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ బిల్లును సమగ్రంగా చర్చించాకే ఆమోదించాలని రఘువీరా సూచించారు. ఏటా వెయ్యి కోట్ల పంటలు పండే భూములను ప్రభుత్వం లాక్కుంటే ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందన్నారు. రైతుల భూమిని లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలకు సంబందించి రాజధాని అంశంపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేలను ప్రజలు తప్పుబడతారన్నారు. ప్రభుత్వ భూములుండగా మరలా రైతుల నుంచి లాక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఆ భూములను గ్రీన్ బెల్ట్ గా ప్రకటిస్తామనడం బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందన్నారు.