మన ఎంపీలు, మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత రైల్వే బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది. కొత్త ప్రాజెక్టుల ఊసు లేకుండా ఈ ఏడాది రైల్వేబోర్డు ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించిన నేపథ్యంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకు నిధుల వరద పారుతుందన్న ఆశ ఆవిరైంది. ఖర్గే స్వరాష్ట్రానికి లబ్ధి చేకూర్చడంలో భాగంగా ప్రకటించిన రైళ్లు మన గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రయాణించనుండటం మాత్రమే ఊరట కలిగిస్తోంది.
గుంతకల్లు, న్యూస్‌లైన్: ఊహించినట్లే అయింది. రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపారు. దాదాపు వెయ్యి కోట్లు ఆశిస్తే.. కనీసం 200 కోట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆంచనా. దీంతో రాయలసీమలో పనులు అదే నత్తనడక రీతిలో కొనసాగుతాయనడంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర సంయుక్త ప్రాజెక్టులకు సైతం అత్తెసరు నిధులతో సర్దుకోకతప్పదని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాయదుర్గం- తుమకూరు, కదిరి-పుట్టపర్తి, చిక్‌బళ్లాపుర-పుట్టపర్తి రైల్వే మార్గాలను నిర్మించాలని 2008-09లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైల్వే శాఖపై తీవ్ర వత్తిడి తెచ్చి సంయుక్త భాగస్వామ్యం ప్రాతిపదికన మంజూరు చేయించారు. 2010-11 బడ్జ్జెట్‌లో ఒక్క రూపాయి విడుదల చేయలేదు.
2011-12లో రైల్వే శాఖ రూ.40 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 50 శాతం విడుదల చేయకపోవడంతోపాటు విడుదల చేసిన నిధులనూ ఖర్చుపెట్టలేదు. 2012-13లో బడ్జెట్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేస్తే తప్ప రైల్వే శాఖ నిధులు ఖర్చుపెట్టమని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కొంత మేరకు నిధులు విడుదల చేసింది. 2013-14లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నిధులు విడుదల చేయించే విషయంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి మాయమాటలు చెబుతూ వచ్చారు.
ఈ ఏడాది కూడా గతేడాది కన్నా భిన్నంగా ఉండదన్న సంకేతాలు రైల్వే వర్గాలు ఇస్తున్నాయి. మరో ఐదారు రోజుల్లో రైల్వే జోన్ కార్యాలయాలకు చేరే పింక్ బుక్‌ల వల్లే అసలు పరిస్థితి తెలుస్తుంది. వంద కోట్లు అవసరమైన గుంతకల్లు విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్, ధర్మవరం- పాకాల డబ్లింగ్, విద్యుదీకరణ, గుత్తి- బెంగళూరు విద్యుదీకరణ, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు - బళ్లారి సెక్షన్ విద్యుదీకరణ ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో పేర్కొనకపోవటంతో ఈ సారి కూడా నిధులు తూతూ మంత్రంగానే ఇచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాల సమాచారం.
ఇక పుట్టపర్తి - చిక్‌బళ్లాపుర, పుట్టపర్తి -కదిరి, కడప- బెంగళూరు, కదిరి-రాయచోటి, కర్నూలు-మార్కాపురం, మంత్రాలయంరోడ్డు-కర్నూలు మార్గాల ఊసెత్తకుండా, నిధులు మంజూరు చేయకుండా తెలివిగా స్వరాష్ట్రంలోని చిక్‌బళ్లాపుర- కోలార్‌మార్గానికి గేజ్ కన్వర్షన్ పేరిట ఆధునికీకరణకు రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే నిధులు మంజూరు చేశారు. పనిలో పనిగా బళ్లారి-లింగసూగూరు (వయా సిరుగుప్ప, సింధనూరు), హుబ్లీ- బెల్గాం(వయా కిట్టూరు) నూతన రైల్వే లైన్లను సాధించి పెట్టారు.
కూచ్.. నిధులు తూచ్
Published Thu, Feb 13 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement