తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్య బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. విశాఖపట్నంలో ఏపీ కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం తీరు చూస్తే అచ్చం చంద్రబాబు మాదిరే డబుల్ స్టాండర్స్ పాటించినట్లు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను మాట్లాడడంలో కూడా ఆయన అదే వైఖరి అవలంభించారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా ఈ సభ జరిగింది. రేవంత్ రెడ్డి రావడంతో ఆయన ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఏర్పడింది. ఆయన తన స్పీచ్‌లో ఎక్కడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు గురించి ప్రస్తావించలేదు. ప్రధాని మోడీని కొద్దిగా విమర్శించినా, చంద్రబాబు జోలికి దాదాపు వెళ్లలేదు. ఒకవేళ వేళ్లినా, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను జతచేసి వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలలో పోటీచేస్తున్నా, ఆయనకు బీజేపీకి, ప్రదాని మోడీకి సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నించారు. అదే టైమ్‌లో చంద్రబాబు బీజేపీతో పొత్తుకట్టిన విషయాన్ని మాత్రం దాదాపు విస్మరించారు. నిజమైన కాంగ్రెస్ వాది అయితే ఈ విషయంలో చంద్రబాబును ఆయన నిలదీయాలి కదా! అలా చేయకపోగా, ఒకసారి బాబుగారు.. అని మరోసారి పెద్దలు... అని చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రదర్శించారు. చంద్రబాబును తూలనాడమని ఎవరూ చెప్పరు.
కాని కాంగ్రెస్ విదానం ఏమిటి? బీజేపీ మతతత్వ పార్టీ అని కదా కాంగ్రెస్ విమర్శించేది. అలాంటి పార్టీతో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం ఏమిటి అని ప్రశ్నించాలి కదా? ఏ షరతులతో అంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చడానికి మోడీ ఏమైనా హామీ ఇచ్చారా అని చంద్రబాబును అడగాలి కదా! గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీని టెర్రరిస్టు అన్నారు కదా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు ఓటు వేస్తే.. మోడీకి వేసినట్లే.. మోడీ గెలిస్తే ముస్లీంలకు ఓట్లు తీసేస్తారని అన్నారు కదా? ఇప్పుడు ఎందుకు టెర్రరిస్టు అన్న నోటితోనే జీ-హుజూర్ అంటున్నావని చంద్రబాబును కడిగి పారేయాలి కదా! అవేమి చేయలేదు. పైగా బీజేపీ అంటే బాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ అని ఒక సొల్లు పురాణం చెప్పారు. ఇక్కడే రేవంత్ చిత్తశుద్దిని శంకించవలసి వస్తోంది. ప్రధాని మోడీని బడేబాయ్ అని రేవంత్ ఆప్యాయంగా పిలుచుకున్నారు. దానిపై బీఆర్‌ఎస్ విమర్శించినా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అని చెప్పుకున్నారు. అదే సిద్దాంతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు మాత్రం వర్తించదట.
ఏపీ రాష్ట్రం కోసం కేంద్రంతో మర్యాదగా ఉండరాదట. మోదీని అప్పట్లో చంద్రబాబు బూతులు తిట్టినట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిట్టాలట. ఇదేమి వాదన..? గతంలో విశాఖలోనే ప్రధాని అదికారిక మీటింగ్‌లో తనకు, మోడీతో ఉన్న సంబందాలు రాజకీయాలకు అతీతమైనవని, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేదని అంటూ ప్రత్యేక హోదా తదితర అంశాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేసిన సంగతి రేవంత్‌కు తెలియకపోవచ్చు. మరి అదే చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హోదా అడిగే పరిస్థితి ఉంటుందా? కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముస్లీంలకు తెలంగాణలో ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తానని అన్నారు. దానిపై రేవంత్ మండిపడ్డారు. తాము రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెప్పారు. అలాంటి బీజేపీతో, అలాంటి అమిత్‌షా చుట్టూ తిరిగి, కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ఒక్క ప్రశ్న కూడా వేయకుండా స్పీచ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిదే అనుకోవాలి.
ముస్లీం రిజర్వేషన్‌లు, సీఏఏలపై ఎందుకు వైఖరి మార్చుకున్నారని చంద్రబాబును నిలదీయాలి కదా! అబ్బే అదేమి చేయలేదు. ఓటుకు నోటు కేసునుంచి చంద్రబాబుతో ఏర్పడిన అనుబంధం అటువంటిదని అనుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి గొప్పగా చెప్పారు. ఓకే. హైదరాబాద్ అభివృద్దికి, ఏపీ, తెలంగాణల అభివృద్దికి వైఎస్ చేసిన కృషిని గట్టిగా చెప్పారు. బాగానే ఉంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ ద్వారా రాయలసీమకు నీరు తీసుకువెళ్లిన విషయాన్ని కూడా రేవంత్ మెచ్చుకున్నారు. చక్కగానే ఉంది. కాని తెలంగాణ శాసనసభలో, బయట కూడా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపైన ఎన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేసీఆర్ కుమ్మక్కై పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ద్వారా అధిక నీటిని వాడుకోవడానికి సమ్మతించారని ఎందుకు విమర్శించారో చెప్పాలి కదా! తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంద్రులపై తీవ్రమైన పరుష భాష ప్రయోగించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రులకు సాయపడతారట.
వైఎస్ షర్మిలను సీఎం చేస్తారట. పాతిక సీట్లు ఇస్తే చాలట. అదేమిటో అర్ధం కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాంతం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకున్నారని చెప్పారు. మరి అలాంటి వైఎస్‌ఆర్‌పై అక్రమ కేసులు ఎలా పెట్టారు? ఆయన చనిపోయాక ఛార్జీషీట్‌లో పేరు ఎలా చేర్చారు? కేంద్రంలో రాహుల్ సంగతి సరే! ఏపీలో చంద్రబాబును సీఎం చేయాలని ఏమైనా వైఎస్ చెప్పారా? చంద్రబాబుకు వ్యతిరేకంగానే కదా.. వైఎస్ ఎప్పుడు పోరాడింది. అలాంటి వైఎస్ కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మెచ్చుకోకపోతే మానేయ్.. ఆయనను వైఎస్ వారసుడు కాదని రేవంత్ ఎలా అన్నారు. పైగా షర్మిల అసలు వారసురాలట. ఆమె తాను తెలంగాణ బిడ్డనని, ఆ గడ్డపైనే ఉంటానని మట్టిపై శపధం చేస్తే, ఆమెను అక్కడ నుంచి వెళ్ళగొట్టిందాకా నిద్రపోని రేవంత్ రెడ్డి, ఇప్పుడు మద్దతు ఇస్తారట. షర్మిల కూడా రేవంత్‌ను బ్లాక్ మెయిలర్ అని నిందించింది. తదుపరి ఆయనతో నే రాజీపడిపోవడంలో రాజకీయ ఉద్దేశం ఏమిటి? గతంలో ఆయా సందర్భాలలో వైఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ ఎప్పుడైనా అందుకు విచారం తెలిపారా? లేదే? ఆయన మరణం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారే.
టీడీపీ మీడియా కళ్లలో ఆనందం చూడడానికి అలా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు వైఎస్ను ప్రశంసిస్తే జనం తెలుసుకోలేరా? రేవంత్ తన తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజంగా గుర్తు ఉంటే షర్మిల ఆ పార్టీలో చేరతారా? వీరంతా కలిసి తమ పార్టీ కోసం కాకుండా, తెలుగుదేశం కోసం, చంద్రబాబు కోసం పని చేస్తున్నారని జనం అర్ధం చేసుకోలేరా? టీడీపీ, బీజేపీ, జనసేనలు నేరుగా పొత్తు పెట్టుకుంటే, కాంగ్రెస్, సీపీఐ వంటివిక టీడీపీకి పరోక్షంగా సహకరిస్తున్నమాట నిజం కాదా? బీజేపీపైక. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న టీడీపీపైకి కత్తి దూయవలసిన వీరు ఆ పని మాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే టార్గెట్‌గా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరికి చెబుతారు దొంగ నీతులు! చంద్రబాబును, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఒక గాటన కట్టి రేవంత్ తెలివిగా ప్రసంగించానని అనుకోవచ్చు. కాని ఆయన అసలు స్వరూపం బట్టబయలు అయిందన్న సంగతి మర్చిపోకూడదు.
రేవంత్ రెడ్డి ఏపీ ప్రజలను దూషించకుండా ఉంటే అదే పదివేలు. ఏపీకి తెలంగాణ నుంచి రావల్సిన ఆస్తులు, విద్యుత్ బకాయిలు వంటివి వెంటనే పరిష్కరిస్తే, అప్పుడు ఏపీ ప్రజలు ఆయన చిత్తశుద్దిని ఒప్పుకుంటారు. అంతే తప్ప, హరికధ చెబితే ప్రజలు మోసపోతారా? ఆయన కాదన్నంత మాత్రానా వైఎస్ వారసుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకుండా పోతారా? కచ్చితంగా వైఎస్‌ఆర్ బాటలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నది నిజం. తండ్రి దారిలో కాకుండా శత్రుకూటమిలో షర్మిల చేరారన్నది వాస్తవం. ఆమెను అడ్డం పెట్టుకుని టీడీపీ, కాంగ్రెస్ పక్షాలు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నది కూడా నిష్టుర సత్యమే. అయినా ఇవేవి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఏమీ చేయలేవు. ఆయన ధైర్యం ముందు వీరెవ్వరూ ఆగలేరని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. మరోసారి నిరూపితం కాబోతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment