ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి. ‘‘సూపర్ సిక్స్’’ అంటూ అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలన ఈ వందరోజుల్లో ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే తానిచ్చిన హామీల అమలుకు ప్రయత్నించారా? లేదా... గతంలో మాదిరిగానే ఈ సారి కూడా వాటిని ఎలా ఎగవేయాలన్న ఆలోచనల్లోనే ఉండిపోయారా?... ఇవీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల్లో మెదలుతున్న సందేహాలు, సంశయాలు!
హామీల అమలులో తన వైఫల్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయాన్ని తెరపైకి తెచ్చిన తన తుచ్ఛ రాజకీయ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని అనాలి.
తాను అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు కూడా జగన్ ప్రభుత్వంపై తోసివేయడంలో బాబుకు మించిన వారు ఇంకోకరు ఉండరేమో. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి సూపర్ సిక్స్ తదితర హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తన అనుభవాన్నంతా ఉపయోగించి సంపద సృష్టిస్తానని.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. ఈవీఎంల మాయాజాలమో.. ప్రజలు నిజంగానే బాబు మాటలను నమ్మి ఓటేశారో స్పష్టంగా తెలియదు కానీ.. అధికారమైతే కూటమికి దక్కింది. దురదృష్టం ఏమిటంటే.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలా అన్న ప్రయాసే బాబు, కూటమి నేతల్లో కనపడింది. అసెంబ్లీ వేదికగా బాబు మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు భయమేస్తోందని మాట్లాడటమే ఇందుకు ఒక నిదర్శనం.
వంద రోజులలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వాగ్దాన భంగం కాకుండా జరిగిందేమిటని ఒకసారి తరచి చూస్తే... విధ్వంసం, విద్వేషం, వక్రభాష్యాలు, హింస, దౌర్జన్యకాండ, అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యంగం, పగ, ప్రతీకారాలే కనిపిస్తాయి. వీటన్నింటితో ఈ వందరోజుల్లో ప్రజలు ఏనాడూ ప్రశాంతంగా ఉండలేకపోయారు. అయినా సరే.. ఈ ప్రభుత్వం చాలా మంచిదని భాగస్వాములతో కలిపి కూటమి ప్రకటించుకుంది. నిర్భీతిగా ప్రచారం చేసుకుంటోంది. చంద్రబాబు ఒకపక్క ఖజానా ఖాళీ అంటూనే.. ఈ రకమైన తప్పుడు ప్రచారాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూండటం ఆశ్చర్యకరం. సూపర్ సిక్స్ హామీల్లో వృద్ధుల ఫింఛన్‌ను వెయ్యి రూపాయల చొప్పున పెంచడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు మినహా మిగిలిన వాటినేవీ అమలు చేసినట్లు కూటమి సైతం చెప్పుకోలేకపోయింది. ప్రచార ప్రకటనల్లోనూ మొక్కుబడిగా వీటిని ప్రస్తావించారు.
విజయవాడలో వరద బాధితుల కష్టాలు ఇప్పటికీ తీరకపోయినా, చంద్రబాబు వరదలపై విజయం సాధించారని చెప్పుకుంటున్నారు. అసలు వరదలు వచ్చిందే బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల అని, బుడమేరు రెగ్యులేటర్‌ను ముందస్తు హెచ్చరికల్లేకుండా అకస్మాత్తుగా విజయవాడ మీదకు వదలి ప్రజలను నానా యాతనకు గురిచేసి, ఇప్పుడు విజయం సాధించామని అంటున్నారు. కరకట్ట మీద తన అక్రమ నివాసం పూర్తిగా మునిగిపోకుండా, అమరావతిలోనే పలు ఇతర ప్రాంతాలు వరద మయం కాకుండా ఉండడానికి ఈ వరదలను సృష్టించారన్న విమర్శలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసిందన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కుట్రలు,కుతంత్రాలు చేయడం తప్ప, తాము చెప్పినవాటిలో ఫలానా స్కీము అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితి కూటమి ప్రభుత్వానిది. పోనీ ఫలానా అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కూడా ఆ ప్రకటనల్లో తెలపలేకపోయారు. వృద్దాప్య పెన్షన్లు ఒక వెయ్యి పెంచినా, లక్షలాది మందికి కోత పెడుతున్నారు.
అన్నా క్యాంటీన్ లలో ఐదు రూపాయలకు భోజనం పెడుతూ లక్షల మంది ఆకలి తీర్చుతున్నామని చెప్పుకున్నారు. రోజూ ఒక క్యాంటీన్ లో వంద నుంచి మూడు వందల మంది తింటే.. లక్షల ప్రజల ఆకలి ఎలా తీరుతుందో తెలియదు. చంద్రబాబు ప్రకటించిన వాటిలో కీలకమైన తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి వాటి గురించి ప్రస్తావనే లేదు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీలపై నోరెత్తితే ఒట్టు. అందుకే సోషల్ మీడియాలో వాటిపై జోకులే జోకులు!! ఇవన్నీ ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి ప్రజల గొంతు నొక్కడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఇంకో ఎత్తు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అద్వాన్నపాలనను సాగిస్తూ చంద్రబాబు అప్రతిష్ట పాలవుతున్నారు.కాకపోతే పవన్ కళ్యాణ్‌ను, బీజేపీని పూర్తిగా లోబరచుకుని అటువైపు నుంచి ఎలాంటి ప్రశ్నలు రాకుండా చేసుకుంటున్నారు.
చంద్రబాబు ఇంతకుముందు చేసిన పద్నాలుగేళ్ల పాలన లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి కానీ మరీ ఇంత నీచంగా లేదు. జగన్ తీసుకువచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, ఇంటి వద్దకే రేషన్..తదితర వ్యవస్థలను రద్దు చేసి ప్రభుత్వాన్ని తిరోగమనం వైపు నడుపుతున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసలుకే మోసం తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఏమవుతుందో తెలియదు సీబీఎస్‌ఈ, టోఫెల్ వంటి వాటిని ఎత్తివేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ సాగించారు.ఎన్నడూ లేని రీతిలో కొన్ని వేల దాడులు, దౌర్జనాలు ఈ వంద రోజులలో జరిగాయి. శాంతిభద్రతలు ఏపీలో ఇంత ఘోరంగా ఎన్నడూ లేవు. కాకపోతే ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ చేయడానికి మాత్రం గట్టిగానే పూనుకున్నారు.
ఇక ఏపీలో ఊరువాడ మద్యం షాపులు రాబోతున్నాయి. తాగినోడికి తాగినంత అన్నట్లుగా తయారు చేస్తున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను,హామీల ఎగవేతను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు మాత్రం కొనసాగిస్తున్నారు.అందులో అత్యంత నీచమైంది తిరుమల ప్రసాదం లడ్డు వివాదం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా తిరుమల లడ్డూపై కామెంట్ చేసి ఉండరు. లడ్డూలో వాడిన నేతిలో జంతువుల కొవ్వు కలుస్తోందని ఆరోపిస్తూ, జగన్ ప్రభుత్వంపై నెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయిన నేయి క్వాలిటీపై అనుమానాలు వస్తే దానిని గత ప్రభుత్వానికి ఆపాదించడం చంద్రబాబు తెలివితేటలకు అద్దం పడుతుంది. తిరుమలకు అపచారం చేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోతారేమో! అందుకే చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్దే అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు ఒకవైపు జగన్ పై ఈ విషయాలలో ఆరోపణలు చేస్తూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తుండగా, జగన్ మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా టిటిడిలో ఉన్న ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించిన పరీక్షల తీరు మొదలైనవాటిని వివరించారు. చంద్రబాబు 20142019 మధ్య టరమ్ లో ఇలా నాణ్యతమీద సందేహాలు వచ్చినప్పుడు పద్నాలుగుసార్లు నేతి టాంకర్లను వెనక్కి పంపారని, తన హాయంలో ఇది పద్దెనిమిదిసార్లు జరిగిందని,అయినా లడ్డూలో ఏదో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్యమైన తిరుమల శ్రీవెంకటేశ్వుడి పట్ల పాపం చేయవద్దని జగన్ కోరారు. చంద్రబాబు ,పవన్ లు కలిపి సుమారు 200 హామీలు ఇచ్చారు.వాటిని అమలు చేయడానికి వారికి చిత్తశుద్ది లేదు.
అవి ఆచరణ సాధ్యం కానివని తెలిసినా,జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని లక్ష్యంతో ఇచ్చిన హామీలవి.ఈ మూడునెలల కాలంలోనే సుమారు 27వేల కోట్ల అప్పుచేసి, అమరావతి పేరుతో మరో పదిహేనువేల కోట్ల అప్పునకు సిద్దం అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిత్యం కుట్రలు,కుతంత్రాలతో కాలం గడుపుతూ ,అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ,ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది.అందువల్లే ప్రజలలో వంద రోజుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నా,ప్రజలు మాత్రం ఇది మహా వంచన ప్రభుత్వంగా పరిగణిస్తున్నారని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment