రైల్వే బడ్జెట్ వచ్చేస్తోంది.. జిల్లాకు ఏమైనా మోసుకొస్తుందా అన్న ఉత్కంఠ జిల్లావాసుల్లో నెలకొంది. ప్రతి ఏడాదీ బడ్జెట్‌కు ముందు ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం.. వాటిని పట్టించుకోకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిసారీ కొత్త రైళ్లు, కొత్త మార్గాలు వస్తాయని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురవుతోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి గుండా కొత్త రైలుమార్గం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనైనా మంత్రి మల్లికార్జున్ ఖర్గే జిల్లా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతారో.. లేదో.. వేచి చూడాల్సిందే...
- న్యూస్‌లైన్, భువనగిరి/
మిర్యాలగూడ/సూర్యాపేట
సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట, బీబీనగర్-నడికుడి మార్గాల్లో జిల్లాలో రైళ్లలో వేలాది మంది నిత్యం ప్రయా ణం చేస్తుంటారు. ప్రస్తుతం రెండు లైన్లు ఉన్న ఉన్న సికింద్రాబాద్-భువనగిరి మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడోలైన్ నిర్మాణం చేపట్టాలని చేసిన ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయింది. బీబీనగర్-నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో డబ్లింగ్ పనులకు నిధులు మంజూరు చేశారు. కానీ పనులు ప్రారంభంకాలేదు.
సూర్యాపేట : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణానికి రైల్వేలైను ఏర్పాటవుతుందని ఈ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా కల కంటున్నారు. కానీ ప్రతి యేడు రైల్వే బడ్జెట్ సమయంలో మొండిచేయి చూపిస్తున్నారు. గతంలో హైదరాబాద్ - సూర్యాపేట - విజయవాడ, జనగాం - సూర్యాపేట - మిర్యాలగూడ, మిర్యాలగూడ - వరంగల్ లైన్లు ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.
గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు కొత్త రైలు మార్గం మంజూరైంది. సూర్యాపేట మీదుగా వరంగల్ జిల్లా డోర్నకల్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి ప్రతిపాదించారు. దీంతో తమకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న సూర్యాపేట వాసులు సంతోషం వ్యక్తం చేశారు. 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి సూర్యాపేట మీదుగా రైల్వే లైను వేయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు.
కానీ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నూతన రైల్వే లైను ప్రతిపాదనలు చేయవద్దని విధాన నిర్ణయం ప్రకటించడంతో ఆయన హామీ నెరవేరలేదు. కాగా మిర్యాలగూడ నుంచి సూర్యాపేట సమీపంలోని కాసరబాద, పుల్లారెడ్డి చెరువు కింది నుంచి ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ గోడాంల పక్క నుంచి డోర్నకల్‌కు గతంలోనే పట్టణానికి చెందిన పారిశ్రామిక వేత్త మీలా సత్యనారాయణ సర్వే చేయించినట్టు సమాచారం. రైల్వే లైను వస్తే ఇప్పటికే జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
భువనగిరి వరకు మూడోలైన్ ఎప్పుడో
సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గంలో భువనగిరి వరకు మూడో రైల్వేలైన్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు అధిగమించవచ్చునని ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పదేళ్ల క్రితం అందజేశారు. దీని వల్ల బీబీనగర్-నడికుడి మార్గంలో, కాజిపేట-సికింద్రాబాద్ మార్గంలో నడిచే రైళ్లు ఏ విధమైన క్రాసింగ్‌లు లేకుండా నిరంతరాయంగా భువనగిరి ప్రాంతం నుంచి ప్రయాణం చేయవచ్చు. లేదంటే ప్రస్తుతం బీబీనగర్ మండలం పగిడిపల్లి వద్ద రోజూ క్రాసింగ్‌ల పేరుతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
వీటి కోసం ఎదురు చూపు
బీబీనగర్ - నల్లపాడు వరకు డబ్లింగ్, విద్యుద్దీకరణ
మిర్యాలగూడ- జగ్గయ్యపేట, మిర్యాలగూడ - జగదర్‌పూర్, కాచిగూడ - చిట్యాల వరకు రెండో లైన్ ఏర్పాటు
నల్లగొండ రైల్వేస్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు
గద్వాల-దేవరకొండ-నాగార్జునసాగర్-మాచర్ల రైల్వేలైన్ ఏర్పాటు
మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ రైల్వేస్టేషన్‌గా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు
జనగాం-సూర్యాపేట-నాగార్జునసాగర్-మాచర్లవరకు రైల్వేలైన్ ఏర్పాటు
మేళ్లచెర్వు-జాన్‌పహడ్ మధ్య లింకింగ్ లైన్ మంజూరుకు ఎదురుచూపు
వరంగల్ జిల్లా డోర్నకల్-మిర్యాలగూడ వరకు కొత్త లైన్‌కు నిధుల విడుదల
ఈ రైళ్లకు హాల్టింగ్ ఇప్పించాలి
సికింద్రాబాద్-ఖాజీపేట సెక్షన్‌లో భువనగిరి, ఆలేరు రైల్వేస్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని ఎంతోకాలంగా కోరుతున్నారు. డివిజన్ కేంద్రమైన భువనగిరితోపాటు, ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన కొలనుపాక జైనదేవాలయానికి వచ్చిపోయే భక్తుల కోసం రైళ్లు నిలపాలని కోరుతున్నారు. భువనగిరిలో తిరుపతి వెళ్లే పద్మావ తి, ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, బాసర మీదుగా వెళ్లే షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిమిషమైనా ఆపాలన్న డిమా ండ్ ఉంది. బీబీనగర్‌లో జన్మభూమి, కృష్ణా, ఎక్స్‌ప్రెస్ రై ళ్లనుఆపాలని కోరుతున్నారు. ఉదయం భువనగిరి నుంచి ఫలక్‌నుమా వెళ్లే డెమో రైలును జనగాం వరకు పొడిగిం చాలని ఆలేరు ప్రాంత ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంఎంటీఎస్ ఎప్పుడో..
ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలని ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వరకే పొడిగిస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు. ఘట్కేసర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వైద్య, విద్యా సౌకర్యాలు.. నిత్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్ల అవసరం ఎంతో పెరిగింది. భువనగిరి డివిజన్ ప్రాంతంలో వేలాది మంది పలురకాల ప్రయాణికులు నిత్యం రైల్వేప్రయాణం చేస్తుంటారు. దీంతోపాటు ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలోని ప్రధాన పట్టణాలకు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే జంక్షన్లకు అనుసంధానంగా వందలాది రైళ్లు నడుస్తుంటాయి. పెరిగిన రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు రైల్వే శాఖ నూతన లైన్ల నిర్మాణం చేపట్టడంలో జాప్యం చేస్తుందని ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
బీబీనగర్ - నల్లపాడు డబ్లింగ్ పనులకు నిధులు మంజూరయ్యేనా?
గుంటూరు రైల్వే డివిజన్ పరి ధిలోకి వచ్చే 239 కిలోమీటర్ల నల్లపాడు-పగిడిపల్లి సింగిల్ లైన్ పనులను డబుల్ లైన్లుగా మార్చడానికి గత బడ్జెట్‌లో అప్పటి రైల్వే మంత్రి మమ తా బెనర్జీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 1998-99లో ఇందుకోసం సర్వే కూడా చేసిన ప్రభుత్వం మరోమారు ఈ బడ్జెట్‌లో సర్వేను చేపట్టారు.
అయితే గుంటూరు-సికింద్రాబాద్ మధ్య దూరం తగ్గడానికి 1974లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ బీబీనగర్-నడికుడి మార్గానికి శంకుస్థాపన చేయగా రైల్వేశాఖ 1989లో ఈ మార్గాన్ని పూర్తి చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు సింగిల్‌లైన్‌తోనే ప్రయాణం సాగుతోంది. దీంతో రైళ్ల క్రాసింగ్ ఎక్కువైపోయింది. అయితే డబుల్ లైన్ చేయడంతోపాటు విద్యుద్దీకరణ చేస్తే గంటల తరబడి క్రాసింగ్‌లు పెట్టే పరిస్థితి నుంచి రైలు ప్రయాణికులకు విముక్తి లభిస్తుంది. దాంతో పాటు 2013-14 బడ్జెట్‌లో ప్రతిపాదించిన డోర్నకల్ - మిర్యాలగూడ కొత్త లైన్‌కు నిధులు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
భువనగిరిలో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలి
బీబీనగర్- నడికుడి మార్గంలోని భువనగిరి శివారులో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. భువనగిరి ప్రాంత ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే బీబీనగర్, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవ చూపి రైల్వేశాఖ దృష్టికి తీసుకువస్తే భువనగిరిలో రెండో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయవచ్చు.
కూత పెట్టేనా..?
Published Wed, Feb 12 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement