రైల్వే సమ్మె ‘సైరన్’?
42 ఏళ్ల తరువాత సమ్మెకు సిద్ధం!
బ్యాలెట్ ద్వారా హెచ్చరించిన కార్మికులు
నెల్లూరు (సెంట్రల్) : రైల్వేలో సమ్మె చేయడం అరుదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంక్‌లు, పోస్టల్, టెలికాం ఉద్యోగులు అప్పుడప్పుడు సమ్మె చేయడం పరిపాటి. కాని రైల్వేలో సమ్మె చేయడం 42 ఏళ్ల క్రితం జరిగింది. రైల్వే సమ్మె జరిగితే కేంద్రమే స్తంభించేపోతుంది. అలాంటి రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. అందుకు పక్కా ప్రణాళిక కూడా రచిస్తున్నారు. 1974 తరువాత రైల్వే కార్మికులు సమ్మెకు దిగనున్నారు. 9వ వేతన సంఘం సూచించిన విధంగా వేతనాల పెంపును నిరసిస్తూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ సమ్మె చేసి కేంద్రానికి దిమ్మతిరిగేటట్లు చేయాలని కార్మికులు, ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
బ్యాలెట్‌తో మొదలుపెట్టి..
రైల్వే సమ్మెకు మొదట బ్యాలెట్‌లో తెలియజెప్పాలని ఇప్పటికే నెల్లూరులోని రైల్వేస్టేషన్‌లో ఇటీవల బ్యాలెట్ రూపంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సిగ్నల్, ఆపరేటింగ్ తదితర అన్ని స్థాయి కార్మికుల అభిప్రాయాలను సైతం తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను మొత్తం రైల్వే ఉన్నతాధికారులకు సైతం పంపారు. దీంతో సమ్మెకు ముందు ఇచ్చే నోటీసుగా బ్యాలెట్ పత్రాలతో హెచ్చరిక చేసినట్లు తెలిస్తోంది.40 శాతానికి పెంచాలని..ప్రస్తుత ఇస్తున్న వేతనాలపై 13 నుంచి 14 శాతానికి పెంపునకు వేతన సంఘం ఆమోదించిగా దీన్ని 40 శాతం పెంచాలని రైల్వే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న రైల్వేలో పగలు, రాత్రి తేడా లేకుండా ప్రాణాలకు సై తం పణంగా పెట్టి విధులు చేస్తున్నా.. కనీసం తగిన వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమంటున్నారు.
రైల్వే స్థంభించనుందా?
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపుగా అన్ని విభాగాల్లో కార్మికులు కలిపి 10 వేల మందికిపైగా ఉన్నారు. రైల్వేలో ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో వీరు సమ్మెలోకి పోతే మాత్రం పూర్తిగా రైల్వే వ్యవస్థ స్తంభించనుంది. బ్యాలెట్‌లో మెజార్టీ ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకుంటే త్వరలోనే సమ్మె నోటీస్ రైల్వే ఉన్నతాధికారులకు ఇచ్చి సమ్మెలోకి దిగేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం.