సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి సవివరమైన నివేదికలను రైల్వే బోర్డుకు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు లైన్లకు సరిపడా అమరావతి మార్గానికి భూసేకరణ జరుగుతుందని, అయితే.. తొలుత సింగల్ లైన్ నిర్మిస్తామని, డిమాండ్‌ను బట్టి రెండో లైను ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో మంగళవారం విజయవాడలో రైల్వే జీఎం సమావేశమయ్యారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోనంతా విద్యుదీకరణ పనులు పూర్తవుతాయని వివరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించామన్నారు. అక్కడ 8 అంతస్తుల బడ్జెట్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే, విజయవాడ, గుంటూరు, గుంతకల్, కర్నూల్ రైల్వేస్టేషన్లను కూడా 2019 మార్చి నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని జీఎం వివరించారు. గుంటూరు–గుంతకల్ సెక్షన్ విద్యుదీకరణ పూర్తయి, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, విజయవాడ–విశాఖ మూడో లైన్, నడిగుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
టీడీపీ ఎంపీల హైడ్రామా
సమావేశానికి హాజరైన 12మంది టీడీపీ ఎంపీలు గందరగోళం సృష్టించారు. రాష్ట్రానికి రైల్వే జోన్ నివ్వాలంటూ సమావేశ మందిరంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అనుమతిచ్చే వరకూ ఏ సమావేశాలకు హాజరుకాబోమంటూ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోది రాష్ట్ర విభజన హామీలను అమలుపర్చడంలేదని, రాష్ట్రంపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపట్ల ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా, ఆ రాష్ట్రంపై నెపం నెట్టి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వారితో కలిసి రైల్వే జోన్ కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, నాలుగేళ్లుగా రైల్వే జోన్ గురించి ప్రస్తావించని టీడీపీ ఎంపీలు ఇప్పుడు చివరి సమావేశంలో రభస చేయడాన్ని చూసి రైల్వే అధికారులు విస్తుబోయారు. అలాగే, ఏడాదికి ఒకసారి జరిగే దక్షిణ మధ్య రైల్వే బోర్డు సమావే«శంలో సాధారణంగా కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సమస్యలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్రగతి తదితర అంశాలపై చర్చ ఉంటుంది. అయితే, మంగళవారం నాటి బోర్డు సమావేశానికి టీడీపీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికో, మహానాడుకో బయల్దేరినట్లు మందీమార్బలంతో తమ వాహనాలకు పార్టీ జెండాలను కట్టుకుని వచ్చి హంగామా సృష్టించడం కూడా విమర్శలకు తావిచ్చింది.
నెల్లూరు స్టేషన్‌ను ఏ–1గా గుర్తించాలి: ఎంపీ వేమిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రైల్వే జోన్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపారు. నెల్లూరు స్టేషన్‌ను ఏ–కేటగిరి నుంచి ఏ–1 కేటగిరిగా మార్చాలని సూచించారు. కోరమాండల్, తమిళనాడు, గంగాకావేరి ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరులో ఆపాలని, ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీలు ఏర్పాటుచేయాలని కోరారు. చెన్నై–నెల్లూరు మధ్య మెమూ రైలు రోజు కనీసం 8 సార్లు తిరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రూ.883కోట్లతో అమరావతికి రైల్వేలైన్
Published Wed, Sep 26 2018 3:50 AM | Last Updated on Wed, Sep 26 2018 11:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment