వర్షం... మరోసారి నష్టాన్ని తెచ్చి పెట్టింది. జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి..
=నల్లబడి.. కుళ్లిపోతున్న పత్తి కాయలు
=నేలకొరిగిన వరి.. వేరుశనగకూ నష్టమే
=పొంగిన జంపన్నవాగు
=ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
వరంగల్, న్యూస్‌లైన్: వర్షం... మరోసారి నష్టాన్ని తెచ్చి పెట్టింది. జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి.. చేనుపైనే తడిసి ముద్దయి నల్లబడుతుంది. వరి, పత్తితో పాటు ఈసారి కొంత ముందుగా విత్తనాలు వేసిన వేరుశనగకు కూడా నష్టం జరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే వరి, పత్తి నష్టం అంచనా ఇప్పుడే చెప్పలేమని, వేరుశనగకు మాత్రం 18 వేల హెక్టార్లలో ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇక బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు సగటున 23.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తం 50 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పరకాలలో 59.4 మి.మీ. కొత్తగూడలో 55.6 మీ., ఏటూరునాగారంలో 53.2 మి.మీ. వర్షం కురిసింది. ఏజెన్సీలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. జంపన్నవాగు పొంగడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరావు కాలనీ, బొచ్చగుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అత్యవసర పరిస్థితుల్లో పడవలతో వెళ్లాల్సి వస్తోంది.
పంటలు నీటిపాలు..
జనగామ, నర్సంపేట, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లి, శివాపూర్ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో వరి మెదలు పూర్తిగా నీటిలో నానిపోయాయి. నర్సంపేట మార్కెట్‌లో సుమారు రూ. 5 లక్షల విలువ చేసే పత్తి, మొక్కజొన్న బస్తాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. జనగామ మార్కెట్‌లో సుమారు 400 బస్తాల ధాన్యం నీటి పాలైంది. ములుగు, ఏటూర్‌నాగారం, మంగపేట మండలాల్లో సుమారు 60 ఎకరాల పత్తి పాడైంది.
పగిలిన పత్తి కాయలు తడిసిపోయాయి. పరకాల పట్టణంలో కొత్త కృష్ణారెడ్డి అనే రైతుకు చెందిన మొక్కజొన్నలు మొలకలు వచ్చాయి. గీసుగొండ మండలం మచ్చాపురం, రంగనాయక తండా, విశ్వనాథపురం గ్రామాల్లో టమాట, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. ఆత్మకూర్ మండలం కామారం, ఊరుగొండ, ఆత్మకూర్ గ్రామాల్లో వరి నేలకు వంగింది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. డోర్నకల్‌లో 30 ఎకరాల్లో వేరుశనగ, పత్తి పంటలు వర్షం ధాటికి నష్టపోయాయి.
మరిపెడ మండలంలో మిర్చి పంట దెబ్బతింది. స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ మండలాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట, హసన్‌పర్తి మండలాల్లో వరి, పత్తి పంటలు నేలకు వాలాయి. అయితే ఇప్పటికే వివిధ తెగుళ్లు ఉన్న పత్తికి ఈ వానలు చాలా ప్రమాదం తెచ్చి పెడుతున్నాయని రైతులు లబోదిమంటున్నారు. పత్తి గూడ మురిగిపోయి రాలిపోతుంది. ఇంకా తెగుళ్లు మరింత వ్యాప్తి చెందుతాయని వ్యవసాయ శాస్త్రవేత్త ఉమ్మారెడ్డి పేర్కొంటున్నారు.
వేరు శనగకూ నష్టమే..
18 వేల హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వానలతో మొక్క బలంగా రాకుండా... తీగ తరహాలో వస్తుందని, దీంతో కాయలు ఉండవంటున్నారు. ముందస్తుగా వేరుశనగ సాగు చేయరాదని చెప్పామని, విత్తనాలు పెట్టిన 25 రోజుల వరకు గింజలకు తడి ఉండరాదని, ఈ వారం రోజుల వ్యవధిలో వేసిన 18 వేల హెక్టార్లు మొత్తం నీటిలో నానిపోతుండటంతో నష్టపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.
వర్షపాతం ఇలా..
చేర్యాల 26.2లో మి.మీ, మద్దూర్ 36.3, నర్మెట్ట 28.2, బచ్చన్నపేట 30.4, జనగామ 21.2, లింగాలఘన్‌పూర్ 26.4, రఘునాథపల్లి 44.2, స్టేషన్‌ఘన్‌పూర్ 25, ధర్మసాగర్ 17.2, హసన్‌పర్తి 29.6, హన్మకొండ 23.4, వర్థన్నపేట 37.8, జఫర్‌గడ్ 11.2, పాలకుర్తి 11.2, దేవరుప్పుల 13.0, కొడకండ్ల 12.4, రాయపర్తి 20.4, తొర్రూర్ 14.4, నెల్లికుదురు 14.2, నర్సింహులపేట 19.6, మరిపెడ 18.2, డోర్నకల్ 17.4, కురవి 20.6, మహబూబాబాద్ 5.4, కేసముద్రం 14.4, నెక్కొండ 3.4, కొత్తగూడ 55.6, ఖానాపురం 22.6, నర్సంపేట 25.2, చెన్నారావుపేట 36.4, పర్వతగిరి 22.8, సంగెం 13.6, నల్లబెల్లి 12.8, దుగ్గొండి 14.4, గీసుకొండ 19.4, ఆత్మకూర్ 19.8, శాయంపేట 26.0, పరకాల 59.4, రేగొండ 22.4, మొగుళ్లపల్లి 35.4, చిట్యాల 20.0, భూపాలపల్లి 25.4, ఘన్‌పూర్(ము)8.4, ములుగు 25.2, వెంకటాపూర్ 13.6, గోవిందరావుపేట 18.8, తాడ్వాయి 53.2, ఏటూరునాగారం 53.2, మంగపేట 34.2, వరంగల్ 19.3 మి.మి. వర్షపాతం నమోదైంది.
తక్షణమే సర్కార్ ఆదుకోవాలి
తుపాన్ కారణంగా జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి. దుగ్గొండి మండలంలోని వివిధ ప్రాంతాలను గురువారం పర్యటించాను. రైతులు కన్నీరుపెడుతున్నారు. కాయ ఏరేదశకొచ్చి పత్తి చేనుమీదనే తడిసిపోయింది. ఒక్కరోజులోనే కాయంతా నల్లగయింది. మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. కళ్ళాల్లో మక్కలు మొలకెత్తాయి. ఇక మిర్చి పూత రాలిపోయింది. ఎక్కడ చూసినా రైతులు గొల్లుమంటున్నారు. తెలంగాణ ప్రాంత రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ సారి రైతులను ఆదుకోకుంటే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. రైతులకు అండగా నిలుస్తాం.
- పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జి
తడిసిన సరుకు కొనాలి
వరుస వానలతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యూయి. రైతులను చూస్తే గుండె తరుక్కుపోతోంది. తడిసిన ధాన్యం, పత్తి, మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలి. అధికారులు వాస్తవస్థితిని ప్రభుత్వానికి నివేదించేందుకు నిజాయితీగా చర్యలు చేపట్టాలి. రైతులను ఆదుకోవాలని కోరుతున్నార .
- తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు,
సీపీఐ జిల్లా కార్యదర్శి
రైతులకు మరో కష్టమొచ్చింది
అకాలవర్షంతో అన్నదాతకు మరో కష్టమొచ్చింది. ఈ ఏడు పంటలు బాగున్నాయనుకుంటే తుపాన్ దెబ్బతీసింది. రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మద్ధతు ధర లేదు. కనీసం కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి. పరిహారంతో పాటు, నాణ్యతలేకుండా పోయిన సరుకులను కొనుగోలు చేసి మంచి ధర వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పరిహారం చెల్లించే వరకు ఒత్తిడి తేవాలి.
- ఆరెళ్లి కృష్ణ, న్యూడెమోక్రసీ నాయకుడు
నష్టం అంచనాకు ఆదేశాలిచ్చాం
- జేడీఏ రామారావు
మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో పంటల నష్టంపై గ్రామాల వారీగా అంచనా వేయాలని మండలాల వ్యవసాయూధికారులకు ఆదేశాలిచ్చామని వ్యవసాయ శాఖ జారుుంట్ డెరైక్టర్ రామారావు చెప్పారు. పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో నష్టంపై ప్రాథమిక అంచనా అందుతుందన్నారు.