రైవాడ రైతులదే..
దేవరాపల్లి: వ్యవసాయ అవసరాల కోసం నిర్మంచిన రైవాడ జలాశయాన్ని రైతులకు పునరంకితం చేసే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆఖరి పోరాటం సాగిస్తున్నామని రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ సభ్యులు తెగేసి చెప్పారు. నీటిసాధన కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. జీవిఎంసీకీ నీరు అందించే లింక్ కెనాల్ నుంచి సీతంపేట, నాగయ్యపేట గ్రామాల మీదుగా వేపాడ మండలం వావిలపాడు వరకు తొలిరోజు పాదయాత్ర సాగింది. వివిధ గ్రామాల రైతులుతో పాటు రైతు సంఘాల నాయుకులు, పార్టీలకు అతీతంగా పలువురు నాయుకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా లింక్ కెనాల్ వద్ద రైతులతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ, ప్రాముఖ్యాన్ని రైతులకు వివరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్. నర్సింగరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పేర్కొన్న విధంగా వ్యవసాయ ఆధారిత జలాశయమైన రైవాడ ప్రాజెక్టును రైతులకు అంకితం చేయకుంటే మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. చిత్తశుద్ధిలేని టీడీపీ ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాటానికి స్వచ్ఛందంగా తరలిరావాలని రైతులకు పిలుపునిచ్చారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు రైవాడ సమస్యపై అసెంబ్లీలో గళం విప్పి పోరాడాలని హితవు పలికారు. రైవాడ నీటి సాధన కమిటీ అధ్యక్షుడు వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ రైవాడను రైతులకు అంకితం చేసి, అదనపు ఆయుకట్టు ఆరువేల ఎకరాలతో పాటు కాలువకు ఆనుకొని ఉన్న గ్రామాలన్నింటికి సాగు నీరందించాలన్నారు. జీవీఎంసీకి పైపులైన్ ప్రతి పాదనను శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రైవాడ రైతులను కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, దీనిపై పోరాటానికి రైతులు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నీటిపారుదలశాఖ రిటైర్డ్ సీఈ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయితేనే విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ సభ్యులు గండి నాయన బాబు, లెక్కల శ్రీనివాసరావు, ఆదిరెడ్డి కన్నబాబు, డి. వెంకన్న, సీహెచ్. రాజు, చల్లా జగన్, లెక్కల అవతారమూర్తి, జామి గోవింద, ఆర్. ముత్యాలనాయుడు, వేమాల కన్నబాబు పాల్గొన్నారు.