
రికార్డులకెక్కనున్న గాజుల గణపయ్య
రాజమండ్రి కల్చరల్ : పుష్కరాల రేవు వద్ద రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ నవరాత్రి వేడుకలు ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు 2009లో ఈ ఉత్స వాలను ప్రాంభించారు. అప్పటి నుంచి ఏటా వైభవోపేతంగా కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ పందిట్లో నిలబెట్టిన గాజుల గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుం టోంది. సుమారు నాలుగు లక్షల గాజులను ఈ విగ్రహానికి ఉపయోగించారు. ఈ విగ్రహం ప్రపంచ రికార్డులలో నమోదు కానున్నదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు, కమిటీ ప్రతినిధి జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నా రు.
వివిధ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు ఇప్పటికే ఈ విగ్రహం రూపకల్పనకు సం బం ధించిన వివరాలు నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గణపతిని సాధారణంగా పురుషరూపంలో పూజిస్తారని అయితే స్త్రీ మూర్తిగా గణేశుని ఆరాధించే సంప్రదాయం కూడా ఉందని ఆ మె అన్నారు. ముద్గల పురాణం, విష్ణుపురాణం, స్కాంద. మత్స్య పురాణాలలో గణపతి స్త్రీరూపం ప్రస్తావన ఉందన్నారు. గణేశ్వరి, వినాయకి, గణేంద్రి ఇత్యాది నామాలతో స్త్రీమూర్తిగా గణపతిని పూజిస్తారని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలోను, కాశీ క్షేత్రంలోను స్త్రీరూప గణపతి ఆలయాలు ఉన్నాయన్నారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులతో కలసి గాజుల గణపతి సన్నిధిలో అయ్యప్ప పడిపూజ, గణపతి పూజలను ఘనంగా నిర్వహించారు. కాగా గణపతి విగ్రహంలో ఉపయోగించిన గాజులను ఆదివారం భక్తులకు పంపిణీ చేస్తామని చెప్పారు.