=పెడనపై కొనకళ్ల కన్ను
=బందరు ఎంపీ సీటుకు పోటీచేయాలని కాగితకు బుజ్జగింపు
=సుజనాచౌదరి రాజేసిన సీటు తుపాను
=ఒకే సామాజికవర్గంలో రేపిన వివాదం
=జిల్లా టీడీపీలో సీటు పాట్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌లు పదిలమైన చోటు కోసం వెదుకులాట మొదలెట్టారు. ఉన్న సీటు దక్కుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో కొత్త చోటు కోసం గాలం వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో జిల్లా టీడీపీలో సీట్ల లొల్లి మళ్లీ మొదలైంది. తాజాగా బందరు పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా సీటు తుపానుకు బీజం పడింది.
ఇందుకు ఇటీవల జిల్లాకు టీడీపీ పరిశీలకుడిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నెరపిన మధ్యవర్తిత్వం కొత్త దుమారానికి దారితీసింది. గత నెల 15న జిల్లా పార్టీ పరిశీలనకు వచ్చిన సుజనాచౌదరి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జిలు, సిట్టింగ్‌లతో మంత్రాగం నెరిపారు. అదే క్రమంలో తనకు ఇష్టులైన కొందరు నేతలను కొత్త చోటుకు సీటు రిజర్వ్ చేసి పెట్టేలా వ్యూహాన్ని రచించారు. ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సేవలందిస్తున్న వారంతా వేరొకరికి తమ సీటు ఇవ్వాలనేసరికి సుజనా చౌదరి తీరుపై గుర్రుగా ఉన్నారు.
ఒకే సామాజికవర్గంలో కొత్త చిచ్చు...
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సుజనాచౌదరి చేసిన ప్రతిపాదన ఒకే సామాజికవర్గంలో కొత్త చిచ్చు రాజేస్తోంది. గత 15 రోజులుగా నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న ఆ వివాదం నేతల మధ్య అంతరాన్ని పెంచేదిగా మారిందని పలువురు టీడీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయాల్లో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ మరోసారి నెగ్గుకురావడంపై అనుమానం వ్యక్తంచేసిన సుజనాచౌదరి చేసిన ప్రతిపాదన వివాదాస్పదమైంది. కొనకళ్లను పెడన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపేందుకు సుజనాచౌదరి ఎత్తులు వేసినట్టు సమాచారం.
దీంతో ఇప్పటికే పెడన టీడీపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ విప్ కాగిత వెంకట్రావును అక్కడి నుంచి తప్పించేందుకు వ్యూహాన్ని పన్నినట్టు వినికిడి. కాగితను బందరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించిన సుజనా పెడన నియోజకవర్గం నుంచి కొనకళ్ల నారాయణరావుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం.
ఎంపీ కొనకళ్ల జిల్లా పార్టీ పరిశీలకుడిగా తెచ్చుకున్న సుజనాచౌదరి ఏ ఉద్దేశంతో కాగితను ఎంపీగా పోటీ చేయాలని చెప్పారన్నది తెలిసిన పార్టీ శ్రేణులు కంగుతిన్నారు. దీంతో పెడన పైనే ఆశలు పెట్టుకున్న కాగిత వెంకట్రావు ఎంపీగా పోటీ చేయడం అంటే రాజకీయంగా కనుమరుగు కావడమేనని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు. సుజనాచౌదరి పెట్టిన ఈ కొత్త మెలిక విషయమై చంద్రబాబు వద్దే పంచాయతీ పెట్టాలని కాగిత అనుచరులు మండిపడుతున్నారు.
ఆంతర్యమేమిటో..
సామాజికవర్గాల సమీకరణ నేపథ్యంలో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కొనకళ్ల నారాయణరావు గెలుపులో అనేక అంశాలు కలిసివచ్చాయి. అటు తరువాత పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఎంపీగా అనుకున్నంత గుర్తింపు పొందలేకపోయారు. దీనికితోడు మారిన రాజకీయ సమీకరణలతో గత ఎన్నికల మాదిరిగా ఈసారి కలిసివచ్చే అవకాశం లేదని గుర్తించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బందరు, పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అంతగా కలిసి రాకపోయినా ఆయనకు గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు వచ్చాయి.
అప్పట్లో కొడాలి నాని, మరికొందరు నేతల ఇమేజ్, కృషి కొనకళ్ల నారాయణరావుకు కలిసి వచ్చింది. గతంలో బాగా కలిసి వచ్చిన నియోజకవర్గాలు ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా మారాయి. దీంతో ఎంపీగా అవకాశాలు సన్నగిల్లిన కొనకళ్ల నారాయణరావు ఎత్తుగడ గానే పెడనపై కన్నేసినట్టు తెలిసింది. దీనివల్ల తక్కువ ఖర్చుతో బయటపడవచ్చన్నది ఆయన ఆంతర్యంగా ప్రచారం జరుగుతోంది. కొనకళ్ల కోసం అదే సామాజిక వర్గానికి చెందిన కాగితను దెబ్బతీస్తే పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మొత్తానికి ఈ సీట్ల లొల్లి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
సీట్ల లొల్లి...
Published Fri, Dec 6 2013 1:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement