రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలే కారణం?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దీనిలో పార్టీ రెండు శాఖల ఏర్పాటు, తెలంగాణ బిల్లు సహా అనేక కీలకాంశాలపై చర్చను కూడా చేపట్టాల్సి ఉంది. అయితే, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ముఠా కుమ్ములాటల నేపథ్యంలో సమావేశం వాయిదా పడినట్టు సమాచారం. ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే 2 శాఖల ఏర్పాటు వాంఛనీయం కాదని పార్టీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారమై పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలోనే వివాదం చెలరేగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వంలో ఉన్న ఓ యువనేత చెప్పిన సూచన మేరకు రాజ్‌నాథ్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టేదాకా వేచి ఉండడం మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చినట్టు సమాచారం.
ర్యాలీకి అనుమతి నిరాకరణపై ఆగ్రహం..
స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘దేశం కోసం పరుగు’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీజేపీ ఖండించింది. పోలీసుల తీరును దేశద్రోహ చర్యగా అభివర్ణించింది.
‘యూనిటీ ఆఫ్ ఇండియా’పై చర్చ
జాతీయ వాదానికి ప్రతీకగా నిలిచిన ‘ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఇండియా’ గ్రంథానికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో చర్చాగోష్టి జరిగింది. భారత్ ఒక దేశం కాదని, భారత జాతీయత అంటూ ఏదీ లేదని బ్రిటీష్ వాళ్లు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ 1913లో భారతీయ యువ చరిత్రకారుడు రాధా కుముద్ ముఖర్జీ ఈ సైద్ధాంతిక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథానికి బ్రిటన్ ప్రధాని రామ్సేమెక్డొనాల్డ్ ముందుమాట రాశారు. ఈ చర్చాగోష్టికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఇదిలావుంటే, భారతీయ జనతా కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా టి.కృష్ణమూర్తి నియమితులయ్యారు.
రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదా
Published Thu, Sep 12 2013 2:51 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement