మాట నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్ | BJP President Rajnath Singh Speech On Telangana | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్

Published Wed, Mar 12 2014 2:49 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

మాట నిలబెట్టుకున్నాం:  రాజ్‌నాథ్ సింగ్ - Sakshi

మాట నిలబెట్టుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్

* రెండు ప్రాంతాల్లోనూ విద్వేషాలు పెంచిన కాంగ్రెస్‌ను ఓడిద్దాం
* అమరవీరులకు తెలంగాణ రాష్ట్రం అంకితం..
* ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చుంటే వారి ప్రాణాలు దక్కేవి
* నరేంద్ర మోడీని ప్రధాని చేసేలా మరిన్ని సీట్లు ఇవ్వండి..
* సుపరిపాలన మాతోనే సాధ్యం, పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు
* బీజేపీ తెలంగాణ అభినందన సభలో రాజ్‌నాథ్ వెల్లడి    

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘మేం మాటిచ్చాం, తెలంగాణ తెచ్చాం. అవునా? కాదా? ఇక తీర్పు చెప్పాల్సింది మీరే’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్.. తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదింపజేయడంలో తమ పార్టీ  నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు కూడా బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు భవిష్యత్ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఇదో అద్భుత అవకాశం. సుపరిపాలన ఎవరిస్తారో ఆలోచించండి. మేమా? వాళ్లా? (కాంగ్రెస్)’’ అని ఉభయ ప్రాంతాల ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ‘బీజేపీ ఎన్నికల శంఖారావం, తెలంగాణ అభినందన, ఆవిర్భావ సభ’ పేరిట మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నాగం జనార్దన్ రెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకరరావు తదితరులు హాజరయ్యారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 2006లో ఇదే మైదానంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చామన్నారు. కుటుంబం విడిపోవడంతోనే కుదేలవకూడదని, గతంలో మాదిరే కొనసాగాలని ఆకాంక్షించారు.
 
 పార్లమెంటులో ఇంత రభస ఎన్నడూ జరగలేదు..

 ‘‘2009 ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చాం. ఆవేళ మేం రాలేదు. ఐదేళ్లు గడిచింది. కాంగ్రెస్ పార్టీ 2009లో మాటిచ్చి తప్పింది. ఒక రాష్ట్ర విభజన విషయమై పార్లమెంటు చరిత్రలో ఇంతటి రభస ఎన్నడూ జరగలేదు. మేమూ మూడు రాష్ట్రాలిచ్చాం. అందరూ సంతోషంగా అంగీకరించి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయానికి పాల్పడింది. తెలంగాణ, ఆంధ్రలో విద్వేషాలు పెంచింది. ఇంతదాకా రాకుండా ఇప్పుడు చేసిన పని ఆవేళే చేసుంటే 1100 మంది చనిపోయి ఉండేవారు కాదు. అందుకే నవ తెలంగాణను అమరవీరులకే అంకితం ఇస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ చెప్పారు.
 
 రెండు ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి

 ‘‘మేం అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలనే దానిపై దృష్టి సారిస్తాం. రైతుల ఆత్మహత్యలు, నక్సల్స్ సమస్య, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మంచినీటి కొరత, కరెంటు కోతలు వంటి ముఖ్యమైన సమస్యలు అక్కడా ఇక్కడా ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే విధమైన ప్రభుత్వాలుంటే వీటిని పరిష్కరించడం సులువు. కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. మేం ఇద్దరికీ న్యాయం చేస్తాం. ఇది నా మాట. మనస్పర్థలు దూరం కావాలి. అన్నదమ్ముల్లా ఉండాలి. ప్రేమ, అప్యాయతలు పెంపొందాలి’’ అని రాజ్‌నాథ్ అభిలషించారు.
 ‘‘కాంగ్రెస్ పార్టీ లాగా ఓట్ల కోసం రాజకీయం చేయడం మా పార్టీ పని కాదు. మాది దేశం కోసం పని చేసే పార్టీ. బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధితో మిగతా రాష్ట్రాలను పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గుజరాత్ అభివృద్ధిని దేశంలోని విశ్లేషకులే కాకుండా అమెరికా పార్లమెంటులోని ఓ పరిశోధనా కమిటీ, సోనియా చైర్మన్‌గా ఉండే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పింది. ఇప్పుడు వేయి రోజులు దాటిపోయినా తగ్గకపోగా పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో ఐదున్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఇక అధికారంలోకి రాబోమని కాంగ్రెస్‌కు అర్థమై నిరాశ, నిస్పృహలతో మానసిక స్థితిని కోల్పోయి మాపార్టీపై విషప్రచారాన్ని ప్రారంభించింది’’ అని విమర్శించారు.
 
 చరిత్ర తెలుసుకో రాహుల్...
 ‘‘మహాత్మా గాంధీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హత్య చేయించిందని రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకోవాలి. గాంధీ హత్య అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించిన నిషేధాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే తొలగించింది. ఈ హత్యపై నియమించిన కపూర్ కమిషన్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పటికయినా ఆయన తన తప్పును తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఇందిరా గాంధీ హత్యపై రాజీవ్ గాంధీ నియమించిన ఠక్కర్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ బయటపెట్టాలి. ఇందిర హత్య వెనుకున్న కుట్ర ఏమిటో ప్రజలకు తెలియజేయాల’’ని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు.
 
 పింగళి వెంకయ్యా మీ వారే...
 ‘‘దేశాభివృద్ధిలో, సమైక్యత, సమగ్రతను కాపాడడంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల వారి పాత్ర చాలా ఎక్కువ. జాతీయ పతాక రూపకర్త పింగళివెంకయ్య తెలుగు వారే’’ అని ఆయన చెప్పారు. ‘‘స్వతంత్ర భారత దేశంలో నరేంద్రమోడీపై జరిగిన రాజకీయ దాడులు మరెవ్వరిపైనా జరగలేదు. వజ్రాన్ని సానబట్టే కొద్దీ ప్రకాశవంతమైనట్టే మోడీ కూడా మరింత రాటు దేలి అన్ని పరీక్షలనూ అధిగమించారు. మోడీ ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోని ఏశక్తీ భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు’’ అని అన్నారు.
 
 మీ మాట విన్నాం, ఇప్పుడు మాకో హామీ ఇవ్వండి: జైట్లీ
 ‘‘తెలంగాణ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి ఓ హామీని కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు ఇచ్చి మోడీ ప్రధాని అయ్యేందుకు సహకరించాలి. అప్పుడు మాత్రమే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టవుతుంది’’ అని అరుణ్ జైట్లీ అన్నారు. తెలంగాణ ఇచ్చిందే తామంటున్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలను ప్రకాశ్ జవదేకర్ తిప్పికొట్టారు. అంత సత్తా ఉంటే తమ పార్టీ నేతలు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీల చుట్టూ ఎందుకు తిరిగావ్? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల అంత శ్రద్ధే ఉంటే 2004లో ఎందుకివ్వలేదన్నారు.
 
 బీజేపీ వ్యూహం వల్లే సాకారమైంది: కిషన్‌రెడ్డి
 బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని, ఇక నవ తెలంగాణ నిర్మాణానికిగాను కాంగ్రెస్‌కు పాతరేసి, బీజేపీకి పట్టం కట్టాలని పార్టీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తూ 1997లోనే బీజేపీ కాకినాడలో స్పష్టమైన తీర్మానం చేసిందని, బంగారు లక్ష్మణ్ స్వయంగా ఆ తీర్మానాన్ని రాశారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నాగర్‌కర్నూల్, పాలమూరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు విద్యాసాగరరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు సభలో ప్రసంగించారు. సినీ పాటల రచయిత లక్ష్మణ్‌సాయి రచించిన తెలంగాణ పాటల సీడీని రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీలు ఆవిష్కరించారు. ఇంద్రసేనారెడ్డి రూపొందించిన ఎన్నికల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
 
 బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు పరామర్శ
 ఇటీవల మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులను రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... లక్ష్మణ్ మృతి పార్టీకి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడం చాలా కష్టమని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
 
 కళాకారులతో స్వాగతం
 బీజేపీ నిర్దేశించుకున్న 272 లోక్‌సభ సీట్ల లక్ష్యానికి అనుగుణంగా 272 మంది డప్పు కళాకారులతో పార్టీ నాయకులు.. రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్రనేత బి.వెంకటరెడ్డి నాయకత్వంలో రామబాణాన్ని రాజ్‌నాథ్‌తో సంధింపజేశారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రాంగణంలో మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చిత్రపటం కనిపించలేదు.
 
 పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు
 రాజ్‌నాథ్‌సింగ్‌కు బేగంపేట విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న ప్రశ్నకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రమే ఆయన జవాబిచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ బసచేసిన హోటల్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ చానళ్ల అధిపతులు ఆయన్ను కలిశారు. తెలుగుదేశానికి రాజీనామా చేసిన సుధీశ్ రాంబొట్ల రాజ్‌నాథ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ లేదా అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement