రాజ్యసభఎన్నికలు నేడే | Rajya Sabha Election Polling today | Sakshi
Sakshi News home page

రాజ్యసభఎన్నికలు నేడే

Published Fri, Feb 7 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

రాజ్యసభఎన్నికలు నేడే

రాజ్యసభఎన్నికలు నేడే

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.

* ఆదాల తప్పుకోవడంతో పోటీ నామమాత్రమే
* కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం
* కేకేకు కొన్ని ఓట్లు వేయనున్న కాంగ్రెస్, ఎంఐఎం!
* ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం
* ఏర్పాట్లను పర్యవేక్షించిన భన్వర్‌లాల్
* తొలిసారిగా తిరస్కార ఓటుకు అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి పోటీనుంచి తప్పుకోవడంతో గెలిచే అభ్యర్థులు దాదాపు ముందే ఖరారయ్యారు. దీంతో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు 16 ఏళ్ల తరువాత జరుగుతున్న పోలింగ్ నామమాత్రంగానే కొనసాగనుంది. ఆదాల ప్రకటనతో వివిధ పార్టీల అధికారిక అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్‌ఎస్)లకు పోలింగ్‌కు ముందే విజయం ఖరారయినట్టే. అయితే ఉపసంహరణ గడువు ఇదివరకే ముగిసిపోవడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నట్లే. దీంతో ఎన్నికలు తప్పనిసరిగా మారాయి.

అసెంబ్లీ కమిటీహాల్ నంబర్-1లో పోలింగ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ లోపల, బయట కూడా భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం అసెంబ్లీకి వచ్చి రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనుందని, ఓటు వేయనున్న ఎమ్మెల్యేలు 276 మంది ఉన్నారని రాజసదారాం వివరించారు. సాయంత్రం అయిదింటి నుంచి లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా వ్యవహరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలు...

* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓపెన్ బ్యాలెట్ విధానంతోపాటు ఎన్నికల్లో పైవి ఏవీ కావు (నోటా) ఆప్షన్‌ను పొందుపరిచి తిరస్కరణకు అవకాశం కల్పిస్తున్నారు. 2004లో ఎన్నికల నిబంధనావళిలో 239 ఏఏ సడలించి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.
     
* బ్యాలెట్ పత్రంలో మొదట కె.కేశవరావు, ఆ తర్వాత గరికపాటి మోహన్‌రావు, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, ఎం.ఏ.ఖాన్, కేవీపీ, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల పేర్లను వరుస క్రమంలో వచ్చాయి. ఎనిమిదో కాలమ్‌లో ‘పైవి ఏవీ కావు’ అని పెట్టారు.
     
* ఓపెన్ బ్యాలెట్‌ను అనుసరిస్తున్నందున ఆయా పార్టీలనుంచి ప్రత్యేక ఏజెంట్లు పోలింగ్‌బూత్‌లోకి అనుమతిస్తారు. ఆయా ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలను చూపించాకనే ఎమ్మెల్యేలు బ్యాలెట్ బాక్సులో దాన్ని వేయాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనేది బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడతారు.
     
* శాసనసభలో మొత్తం 294 స్థానాలకు ప్రస్తుతం 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఒక్కో సభ్యుడికి ఓటుహక్కు లేదు. మిగిలిన 276 ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటే ఒక్కొక్క అభ్యర్థి గెలుపునకు 40 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాలి.

* వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న మరో ఆరుగురు.. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్టీకి మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి.. ఏకైక సీపీఎం ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉంటారని ఆయా పార్టీలు ప్రకటించాయి.
     
* వీరిని మినహాయించి మిగిలిన 248  ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే పక్షంలో ఒక్కొక్క అభ్యర్థి గెలుపునకు 37 ఓట్లు రావాల్సి ఉంటుంది. పోటీ నామమాత్రంగానే జరుగుతున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంఐఎంల ఓట్లలో కొన్ని ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి కేశవరావుకు వేసేలా ఏర్పాటు జరుగుతున్నాయని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement