
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్ విషయంలో అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. ఒకే అభ్యర్థికి ఎక్కువ మంది ఓట్లు వేయకుండా.. ముగ్గురు అభ్యర్థులూ కచ్చితంగా గెలిచేలా వ్యూహం సిద్ధం చేస్తోంది.
నేరుగా టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను అభ్యర్థుల మధ్య విభజిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల విషయంగా సమస్యలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. వారు ఓటేయకున్నా ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరికీ పక్కాగా శిక్షణ ఇస్తోంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి సంబంధించిన బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించింది.
ఆ ఎమ్మెల్యేలతో ఇబ్బందులు!
టీఆర్‌ఎస్ నుంచి అధికారికంగా గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్టుగా ప్రకటించుకున్న టీడీపీ (12), వైఎస్సార్‌సీపీ (3), బీఎస్పీ (2) ఎమ్మెల్యేలు కలుపుకొంటే టీఆర్‌ఎస్‌కు అధికా రికంగా 82 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓట్లపై డోలాయమాన పరిస్థితి ఉంది.
టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని మజ్లిస్ ప్రక టించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటేసే వారి సంఖ్య 89కి చేరుకుంది. ఇక శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలకుగాను.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణతో ఆ సంఖ్య 117కు తగ్గుతోంది. ఈ లెక్కన గెలిచే అభ్యర్థికి 29 ఓట్లు వస్తే సరిపోతుందని టీఆర్‌ఎస్ వర్గాలు లెక్కగడుతున్నాయి. పోలింగ్‌కు సభ్యులు గైర్హాజరైతే గెలవడానికి 26 లేదా 27 ఓట్లు సరిపోతాయన్న అంచనా ఉంది.
ఇద్దరు మంత్రులకో అభ్యర్థి బాధ్యత
ఒక్కో అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యతను ఇద్దరు చొప్పున మంత్రులకు కేసీఆర్ అప్పగించారు. జోగినిపల్లి సంతోష్ గెలుపు బాధ్యతను మంత్రులు కేటీఆర్, ఈటలకు.. బండా ప్రకాశ్ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులకు.. బడుగుల లింగయ్యయాదవ్ బాధ్యతను మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డిలకు అప్పగించారు. దీనికి అనుగుణంగానే ముగ్గురు అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్యేలను ఆయా మంత్రులు సమన్వయం చేస్తున్నారు.
ఒకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం, మరో అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి.. ఒక్కో సభ్యుడికి వేర్వేరుగా ఓటర్లను కేటాయించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 82 ఓట్లలో 30 మందిని సంతోష్‌కుమార్‌కు, మరో 30 మందిని బండా ప్రకాశ్‌కు కేటాయించారు. మిగతా 22 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు కలిపి 29 మందిని లింగయ్యయాదవ్‌కు కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి చేరిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓట్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు.
ఆ ఇద్దరికీ ఓటుహక్కు లేనట్టే...
కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాన్ని బహిష్కరించిన నేపథ్యంలో అధికారికంగా 117 మంది సభ్యులే ఉన్నట్టు శాసనసభ మంగళవారం ప్రకటించింది. దీంతో 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఇద్దరికి ఓటుహక్కు లేనట్టేనని శాసనసభ అధికారవర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు అవసరం లేకుండానే టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశముందని పేర్కొంటున్నాయి. అయితే పార్టీ విప్ వర్తింపు, చట్టపరంగా ఎదురయ్యే చిక్కులు వంటివాటి విషయంలో కాంగ్రెస్ అనుసరించే వ్యూహాన్ని బట్టి ఎత్తులు వేయాలనే టీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు వస్తాయనుకుంటే ఓటింగుకు గైర్హాజరు చేయించనున్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్
రాజ్యసభ ఎన్నికల కసరత్తు కోసం మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. టీఆర్‌ఎస్ సొంత ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు కలిపి 97 మంది దీనికి హాజరయ్యారు. ముగ్గురు అభ్యర్థులకు 33, 32, 32 చొప్పున ఓట్లను కేటాయించి.. మాక్‌పోలింగ్ నిర్వహించారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్యేలతోపాటు కాలె యాదయ్య ఓటును సంతోష్‌కుమార్‌కు.. వరంగల్, ఖమ్మం, మెదక్ ఎమ్మెల్యేలను బండా ప్రకాశ్‌కు.. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలను బడుగుల లింగయ్య యాదవ్‌కు కేటాయించారు. ఇక టీఆర్‌ఎస్‌ఎల్పీలోనూ రెండురోజులు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment