సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించి, ఓట్లు తమకు అనుకూలంగా పడే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా బూత్ కమిటీలను అప్రమత్తం చేస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా.. ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేశాయి.
ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చే భారాన్ని పార్టీలన్నీ బూత్‌కమిటీలపై పెట్టాయి. పోలింగ్ రోజు, అంతకుముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్‌చార్జిలను పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. కేటాయించిన బూత్‌ల పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమ పార్టీకే ఓటు వేయించే బాధ్యతను పూర్తిగా బూత్ కమిటీలకే అప్పగించారు.
ఇదే బాటలో అన్ని పార్టీలు..
ప్రతి 10 నుంచి 20 మంది ఓటర్లకు ఒక బూత్‌స్థాయి నేత, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జి, బూత్‌కమిటీలను సమన్వయపరిచేందుకు 5 గ్రామాలకు ఒక పార్టీ నేతను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ గ్రామాల ఇన్‌చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేతలను నియమించారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో కమిటీలు నియమించుకున్నాయి. కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు.
ఇప్పటికే ఆయా సంఘాలతో మాట్లాడుతున్న నేతలు, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపై బూత్‌కమిటీలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. కొత్త ఓటర్లతో చర్చించి పార్టీలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ పార్టీకి తప్పకుండా పడతాయని భావించిన ఓట్లను వేయించడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ, వృద్ధ, దివ్యాంగ ఓటర్లపై కమిటీలు దృష్టి పెడుతున్నాయి. ఈ బూత్‌కమిటీ నేతలకు పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ఓట్లు పడే మార్గాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక భారమంతా బూత్ కమిటీలదే!
Published Thu, Dec 6 2018 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment