Rajya Sabha election polling
-
‘రాజ్యసభ’పై పక్కా వ్యూహం!
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్ విషయంలో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. ఒకే అభ్యర్థికి ఎక్కువ మంది ఓట్లు వేయకుండా.. ముగ్గురు అభ్యర్థులూ కచ్చితంగా గెలిచేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. నేరుగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను అభ్యర్థుల మధ్య విభజిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల విషయంగా సమస్యలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. వారు ఓటేయకున్నా ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ పక్కాగా శిక్షణ ఇస్తోంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి సంబంధించిన బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించింది. ఆ ఎమ్మెల్యేలతో ఇబ్బందులు! టీఆర్ఎస్ నుంచి అధికారికంగా గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్లో విలీనమైనట్టుగా ప్రకటించుకున్న టీడీపీ (12), వైఎస్సార్సీపీ (3), బీఎస్పీ (2) ఎమ్మెల్యేలు కలుపుకొంటే టీఆర్ఎస్కు అధికా రికంగా 82 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓట్లపై డోలాయమాన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్కు మద్దతిస్తామని మజ్లిస్ ప్రక టించిన నేపథ్యంలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటేసే వారి సంఖ్య 89కి చేరుకుంది. ఇక శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలకుగాను.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణతో ఆ సంఖ్య 117కు తగ్గుతోంది. ఈ లెక్కన గెలిచే అభ్యర్థికి 29 ఓట్లు వస్తే సరిపోతుందని టీఆర్ఎస్ వర్గాలు లెక్కగడుతున్నాయి. పోలింగ్‌కు సభ్యులు గైర్హాజరైతే గెలవడానికి 26 లేదా 27 ఓట్లు సరిపోతాయన్న అంచనా ఉంది. ఇద్దరు మంత్రులకో అభ్యర్థి బాధ్యత ఒక్కో అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యతను ఇద్దరు చొప్పున మంత్రులకు కేసీఆర్ అప్పగించారు. జోగినిపల్లి సంతోష్ గెలుపు బాధ్యతను మంత్రులు కేటీఆర్, ఈటలకు.. బండా ప్రకాశ్ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులకు.. బడుగుల లింగయ్యయాదవ్ బాధ్యతను మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డిలకు అప్పగించారు. దీనికి అనుగుణంగానే ముగ్గురు అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్యేలను ఆయా మంత్రులు సమన్వయం చేస్తున్నారు. ఒకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం, మరో అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి.. ఒక్కో సభ్యుడికి వేర్వేరుగా ఓటర్లను కేటాయించారు. టీఆర్ఎస్కు చెందిన 82 ఓట్లలో 30 మందిని సంతోష్‌కుమార్‌కు, మరో 30 మందిని బండా ప్రకాశ్‌కు కేటాయించారు. మిగతా 22 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు కలిపి 29 మందిని లింగయ్యయాదవ్‌కు కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి చేరిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓట్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు. ఆ ఇద్దరికీ ఓటుహక్కు లేనట్టే... కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాన్ని బహిష్కరించిన నేపథ్యంలో అధికారికంగా 117 మంది సభ్యులే ఉన్నట్టు శాసనసభ మంగళవారం ప్రకటించింది. దీంతో 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఇద్దరికి ఓటుహక్కు లేనట్టేనని శాసనసభ అధికారవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు అవసరం లేకుండానే టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశముందని పేర్కొంటున్నాయి. అయితే పార్టీ విప్ వర్తింపు, చట్టపరంగా ఎదురయ్యే చిక్కులు వంటివాటి విషయంలో కాంగ్రెస్ అనుసరించే వ్యూహాన్ని బట్టి ఎత్తులు వేయాలనే టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు వస్తాయనుకుంటే ఓటింగుకు గైర్హాజరు చేయించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ రాజ్యసభ ఎన్నికల కసరత్తు కోసం మంగళవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ సొంత ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు కలిపి 97 మంది దీనికి హాజరయ్యారు. ముగ్గురు అభ్యర్థులకు 33, 32, 32 చొప్పున ఓట్లను కేటాయించి.. మాక్‌పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్యేలతోపాటు కాలె యాదయ్య ఓటును సంతోష్‌కుమార్‌కు.. వరంగల్, ఖమ్మం, మెదక్ ఎమ్మెల్యేలను బండా ప్రకాశ్‌కు.. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలను బడుగుల లింగయ్య యాదవ్‌కు కేటాయించారు. ఇక టీఆర్‌ఎస్‌ఎల్పీలోనూ రెండురోజులు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. -
రాజ్యసభఎన్నికలు నేడే
-
రాజ్యసభఎన్నికలు నేడే
* ఆదాల తప్పుకోవడంతో పోటీ నామమాత్రమే * కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం * కేకేకు కొన్ని ఓట్లు వేయనున్న కాంగ్రెస్, ఎంఐఎం! * ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం * ఏర్పాట్లను పర్యవేక్షించిన భన్వర్‌లాల్ * తొలిసారిగా తిరస్కార ఓటుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి పోటీనుంచి తప్పుకోవడంతో గెలిచే అభ్యర్థులు దాదాపు ముందే ఖరారయ్యారు. దీంతో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు 16 ఏళ్ల తరువాత జరుగుతున్న పోలింగ్ నామమాత్రంగానే కొనసాగనుంది. ఆదాల ప్రకటనతో వివిధ పార్టీల అధికారిక అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి (టీడీపీ), కే కేశవరావు (టీఆర్ఎస్)లకు పోలింగ్‌కు ముందే విజయం ఖరారయినట్టే. అయితే ఉపసంహరణ గడువు ఇదివరకే ముగిసిపోవడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నట్లే. దీంతో ఎన్నికలు తప్పనిసరిగా మారాయి. అసెంబ్లీ కమిటీహాల్ నంబర్-1లో పోలింగ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ లోపల, బయట కూడా భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం అసెంబ్లీకి వచ్చి రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనుందని, ఓటు వేయనున్న ఎమ్మెల్యేలు 276 మంది ఉన్నారని రాజసదారాం వివరించారు. సాయంత్రం అయిదింటి నుంచి లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా వ్యవహరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలు... * సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓపెన్ బ్యాలెట్ విధానంతోపాటు ఎన్నికల్లో పైవి ఏవీ కావు (నోటా) ఆప్షన్‌ను పొందుపరిచి తిరస్కరణకు అవకాశం కల్పిస్తున్నారు. 2004లో ఎన్నికల నిబంధనావళిలో 239 ఏఏ సడలించి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. * బ్యాలెట్ పత్రంలో మొదట కె.కేశవరావు, ఆ తర్వాత గరికపాటి మోహన్‌రావు, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, ఎం.ఏ.ఖాన్, కేవీపీ, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల పేర్లను వరుస క్రమంలో వచ్చాయి. ఎనిమిదో కాలమ్‌లో ‘పైవి ఏవీ కావు’ అని పెట్టారు. * ఓపెన్ బ్యాలెట్‌ను అనుసరిస్తున్నందున ఆయా పార్టీలనుంచి ప్రత్యేక ఏజెంట్లు పోలింగ్‌బూత్‌లోకి అనుమతిస్తారు. ఆయా ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలను చూపించాకనే ఎమ్మెల్యేలు బ్యాలెట్ బాక్సులో దాన్ని వేయాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనేది బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడతారు. * శాసనసభలో మొత్తం 294 స్థానాలకు ప్రస్తుతం 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి ఒక్కో సభ్యుడికి ఓటుహక్కు లేదు. మిగిలిన 276 ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటే ఒక్కొక్క అభ్యర్థి గెలుపునకు 40 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాలి. * వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న మరో ఆరుగురు.. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్టీకి మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి.. ఏకైక సీపీఎం ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉంటారని ఆయా పార్టీలు ప్రకటించాయి. * వీరిని మినహాయించి మిగిలిన 248 ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే పక్షంలో ఒక్కొక్క అభ్యర్థి గెలుపునకు 37 ఓట్లు రావాల్సి ఉంటుంది. పోటీ నామమాత్రంగానే జరుగుతున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంఐఎంల ఓట్లలో కొన్ని ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరావుకు వేసేలా ఏర్పాటు జరుగుతున్నాయని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. -
పోలింగ్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దూరం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడం లేదు. రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంతటి సంఖ్యాబలం తమకు లేదు కనుక తమ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఫిబ్రవరి 23వ తేదీన పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి ప్రకటించిన విషయం విదితమే! పోలింగ్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనరాదని వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేసింది. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్యేలందరికి విప్‌ను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేదు కనుక తాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని పార్టీ ఇది వరకే ప్రకటించింది. బాలినేని జారీ చేసిన విప్లో కూడా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనరాదనేది పార్టీ విధానం కనుక పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.