నా వర్గం వారిని రక్షించేందుకే చేరా...
- పోలీసు విచారణలో ఐఎస్‌ఐఎస్ సభ్యుడు సల్మాన్ వెల్లడి
- అతడి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: విజిట్ వీసా మీద దుబాయ్‌కు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం పోలీసులకు పట్టుబడిన ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ సభ్యుడు సల్మాన్ మొహియుద్దీన్ విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు. సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న తమ వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్‌ఐఎస్‌లో చేరానని పోలీసుల విచారణలో అంగీకరించాడు.
‘దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు నక్కీ జోసెఫ్ అలియాస్ ఆయేషాతో కలసి దుబాయ్ నుంచి టర్కీ మీదుగా రహస్యంగా సరిహద్దులు దాటి సిరియా చేరాలనుకున్నా, అమెరికాలో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించా. అక్కడ వీసా రాకపోవడంతో హైదరాబాద్‌కు వచ్చా. ఐఎస్‌ఐఎస్‌లో శిక్షణ తరువాత ఇక్కడ కూడా (హైదరాబాద్‌లో) ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయాలనుకున్నా’ అని సల్మాన్ విచారణలో పోలీసులకు తెలిపాడు.
సల్మాన్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్...
విమానాశ్రయంలో సల్మాన్ తమకు చిక్కకుండా ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్‌లో భారీ విధ్వంసం జరిగేదని పోలీసులు అంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న లాప్‌టాప్ హార్డ్‌డిస్క్‌ను విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సల్మాన్‌ను పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఆర్‌జీఐఏ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, చర్లపల్లి జైలులో ఉన్న సల్మాన్‌ను చూసేందుకు శనివారం కుటుంబసభ్యులు వచ్చివెళ్లారు.
ఫేస్‌బుక్, ట్వీటర్లపై ఆరా..
‘దౌలాన్ న్యూస్’ పేరుతో సల్మాన్ నడుపుతున్న ఫేస్‌బుక్, ట్వీటర్ ఖాతాలో ఉన్నవారి జాబితాపై కూడా పోలీసులు దృష్టిసారించారు. అక్టోబర్‌లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాక సల్మాన్ ఎన్ని పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచాడు, ఎంత మందితో పరిచయం పెంచుకున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని తేలింది. సల్మాన్ మొబైల్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
‘ఐఎస్’వైపు 87 మంది హైదరాబాదీలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 87 మంది విద్యావంతులు కూడా ఐఎస్‌ఐఎస్ వైపు ఆకర్షితులైన వారిలో ఉన్నారు. వీరిలో 44 మంది యువకులకు సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మిగతావారిపై గట్టి నిఘా పెట్టారు. వీరంతా శివార్లలోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో చదువుతున్నవారే కావడం గమనార్హం.
అప్రమత్తమైన పోలీసులు...
ఐఎస్‌ఐఎస్ జాడలు మరోసారి నగరంలో కనిపించడంతో జంట పోలీసు కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేస్‌బుక్ ఖాతాలపై నిఘాను సైతం పెంచారు.
‘‘ సిరియాలో చిత్రహింసలకు గురవుతున్న మా వర్గం వారిని రక్షించుకునేందుకే ఐఎస్‌ఐఎస్‌లో చేరా. దుబాయ్‌లో ఉన్న నా ప్రియురాలు అయేషాతో కలిసి టర్కీ నుంచి రహస్యంగా సిరియాకు వెళ్లాలనుకున్నాం. అమెరికా నుంచే దుబాయ్‌కి విజిటింగ్ వీసా మీదా వెళ్లాలనుకున్నా.. కానీ, వీలుకాలేదు. అందుకే హైదరాబాద్‌కు వచ్చి నాలుగు నెలల తర్వాత మళ్లీ దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించా.’’
- పోలీసుల విచారణలో ఐఎస్‌ఐఎస్ సభ్యుడు సల్మాన్