
అనంతపురం అర్బన్: పోలీసుల ద్వారా ఉద్యమాలను అణచివేసేందుకు సిద్ధపడిన రాక్షస ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. సోమవారం మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిలో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. అప్పటికే కలెక్టరేట్, నగర పాలక సంస్థ వద్ద భారీగా మొహరించిన పోలీసులు.. కార్మికులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. పోలీసులు తీరుపై సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు.
కార్మికుల అరెస్టు: వి.రాంభూపాల్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శకుంతల, జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి, వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.