సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాజకీయంగా సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ అధిష్టానంపై అదే పార్టీ కి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఘాటైన విమర్శలకు దిగడం చర్చనీయాంశమవుతోంది. ‘రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలు చేస్తే ప్రజలు క్షమించరు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తే చరిత్రహీనులవుతారు. విభజన అంశాన్ని పార్టీ అధిష్టానం పునరాలోచించాలి. స్వలాభం కోసం రాష్ట్రాన్ని రకరకాలుగా మార్చివేయడం తగదు’- పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట అన్న మాటలివి. సొంత పార్టీ పైనే ఇలా విమర్శించడం వెనుక తోట ఆవేశం కాక రాజకీయపరమైన దూరాలోచన దాగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ అడ్రస్ సీమాంధ్రలో గల్లంతవుతుందన్న ముందుచూపుతోనే తోట ఇలా మాట్లాడి ఉంటారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.త్రిమూర్తులు రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి రామచంద్రపురంలో జరిగిన ఒకో ఎన్నికల్లో ఒకో పార్టీ తరఫున పోటీ చేస్తూ వస్తున్నారు.
మొదట ఇండిపెండెంట్‌గా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున, 2008లో ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఆ పార్టీ విలీనం తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి.. ఇలా పలు పార్టీల నుంచి పోటీ చేసి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉండి ఆ పార్టీ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేయడం సొంతగూటి(టీడీపీ)కి తిరిగి వెళ్లే ఉద్దేశంతోనా లేక ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చెపుతున్నట్టు కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలోకి వెళ్లడానికా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై అలా మాట్లాడారే తప్ప ఈ వ్యాఖ్యలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం తగదని తోట సన్నిహితులు ఖండిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే అయిన అనంతరం పలు చోట్ల తోట ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయాన్ని బలపరిచేవిగా ఉన్నాయంటున్నారు.
నిష్ర్కమణపై గతం నుంచే ప్రచారం..
గతంలో రామచంద్రపురంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వీఎస్‌ఎం కాలేజీలో జరిగిన సభలో తాను ఏ పార్టీలోకి వెళితే ప్రజలు ఆ పార్టీలోకే వస్తారని త్రిమూర్తులు అన్నారు. ఇందుకు సీఎం కూడా అంతే వేగంగా స్పందించారు. ‘త్రిమూర్తులుకు ఇదే లాస్ట్ స్టేషన్. మరొక స్టేషన్ లేదు. అతను కాంగ్రెస్‌లోనే కొనసాగాలి’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. వీరిద్దరి మాటల మర్మం ఏమైనా నియోజకవర్గంలో మాత్రం త్రిమూర్తులు తిరిగి టీడీపీకి వెళ్లిపోతారనే ప్రచారం అప్పటి నుంచే జోరుగా సాగింది. గతంలో టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు కూడా త్రిమూర్తులు ఇదే రీతిన స్పందించారని తెలుగుతమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. 2008లో కాకినాడ రూరల్ తిమ్మాపురంలో పార్టీ నేతలతో భేటీ అయిన సందర్భంలో త్రిమూర్తులు టీడీపీ అధినేత చంద్రబాబు తీరును తూర్పార బట్టారు. ఆ తరువాతే పీఆర్పీకి వలసపోయారు. టీడీపీని వీడి పీఆర్పీలోకి ఎందుకు వెళుతున్నానే విషయాన్ని వివరించేందుకు ద్రాక్షారామలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభిమానుల కేరింతల మధ్య టీడీపీ జెండాలను కిందపడేసి తొక్కిన విషయాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
కాగా చంద్రబాబు కూడా ఉప ఎన్నిక సందర్భంగా ద్రాక్షారామ రోడ్‌షోలో త్రిమూర్తులుపై ఘాటైన విమర్శలు చేశారు. ‘భూకబ్జాదారుడు, సెటిల్‌మెంట్‌లు చేసే నాయకుడు పోటీచేస్తున్నాడు. ఆలోచించి ఓటేయండి’ అన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు తోటను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నా, ఇందుకు వ్యతిరేకంగా ఆ సామాజికవర్గంలోని మరికొందరు కీలక నాయకులు రెండు రోజుల క్రితం భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. కాగా ఇన్ని విమర్శలు చేసిన చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపికి తమ నాయకుడు వెళతారని ప్రచారంలో అర్థం లేదని త్రిమూర్తులు వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీపై త్రిమూర్తులు సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయంగా పలు ఊహాగానాలకు కారణమయ్యాయి.
మళ్లీ జంప్?
Published Thu, Sep 26 2013 12:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement