కొత్త కోణంలో పోలీసుల దర్యాప్తు
మదనపల్లె క్రైం: పట్టణానికి చెందిన చిరు వ్యాపారి పంతల రమేష్‌బాబు(45) ఆత్మహత్యపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా రమేష్ సూసైడ్ నోట్‌లో రాసిన పేర్ల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. మూడు నెలల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికుడు వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక వారి పేర్లతో సహా వెల్లడించి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే తాళ్లసుబ్బన్న కాలనీకి చెందిన చిరు వ్యాపారి పంతల రమేష్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే... మండలంలోని కొత్తపల్లె పంచాయతీ తాళ్లసుబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్న రమేష్‌బాబు(45) నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్‌లో వినాయక ఆయిల్ స్టోర్ 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారుల నుంచి రూ.30 లక్షల వరకు అప్పు చేశాడు. రోజువారి సంపాదన వడ్డీకే సరిపోతుండడంతో ఇల్లు గడవడం కష్టతరంగా మారింది. దీంతో భార్య ఆరు మాసాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి శరీరంపై ప్యాంటు లేదా పంచె లేకపోవడం, చనిపోయినప్పుడు తలుపులు తెరిచి ఉండడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం చిందరవందర కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేస్తుకున్నాడా...? లేక పథకం ప్రకారం అడ్డు తొలగించుకోవడానికి భార్య తరపు వారెవరైనా హతమార్చారా అన్న కోణంలోనూ, సూసైడ్ నోట్‌లో రాసిన వడ్డీ వ్యాపారులపైనా దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.