ఇదేం తోఫా | Ramzan Tohfa kits not good | Sakshi
Sakshi News home page

ఇదేం తోఫా

Published Sun, Jul 3 2016 8:41 AM | Last Updated on Sat, Jul 28 2018 5:45 PM

ఇదేం తోఫా - Sakshi

ఇదేం తోఫా

  • జిల్లాలో 1,310 ముస్లిం కుటుంబాలకు అందని రంజాన్ తోఫా సరుకులు
  • ఆన్‌లైన్‌లో కొన్ని పేర్లు గల్లంతు
  • మండలాల వారీగా మరోసారి జాబితాలు పంపిన అధికారులు
  •  
    రంజాన్ తోఫా పేరిట పేద ముస్లింలను రాష్ట్ర సర్కారు మరోసారి దగా చేసింది. గత ఏడాది రంజాన్ సందర్భంగా నాసిరకం సరుకులు అందించి అభాసు పాలైన సర్కారు ఆ తరువాత అయినా పాఠాలు నేర్చుకోలేదు. ఈసారి కూడా పాత పద్ధతిలోనే పలువురికి నాసిరకం సరుకులను అంటగడుతోంది. కొందరికి సరుకులే లేకుండా చేసింది. మరీ ముఖ్యంగా.. ముస్లింలు ఆవునెయ్యి ఉపయోగించరని తెలిసి కూడా దానిని సరఫరా చేసి మరీ వారి మనోభావాలను దెబ్బతీసింది.
     
    కొవ్వూరు/దేవరపల్లి/ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో పేద ముస్లింలకు రంజా న్ తోఫా పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న సరుకులు సక్రమంగా అంద టం లేదు. జిల్లాలో తెల్లరేషన్ కార్డులు గల 26,749 పేద ముస్లిం కుటుంబాలకు ‘చంద్రన్న తోఫా’ పేరిట నాలుగు నిత్యావసర సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ అంది స్తామని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. జూలై 1వ తేదీన వీటిని అందించాల్సి ఉండగా, శనివారం నాటికి కనీసం 10శాతం మందికి కూడా సరుకులు అందలేదు.
     
    మరోవైపు 1,310 మంది కార్డుదారులకు అసలు సరుకులే కేటాయించలేదు. ఒక్కొక్క కుటుంబానికి ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి చొప్పున ఒక సంచిలో వేసి అందించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో కొందరి పేర్లు ఆన్‌లైన్‌లో రాకపోవడంతో సరుకులు పొందే అవకాశం లేకుండాపోయింది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి పంపిన జాబితాల్లో కొందరు లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో వారికి సరుకులు కేటాయించలేదు. దేవరపల్లి మండలంలో 450 మంది కార్డుదారులకు గాను 132 మందికి అందలేదు.
     
    గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 2,144 పేద ముస్లిం కుటుంబాలు ఉండగా, 168 కుటుంబాలకు సరుకులు కేటాయించలేదు. కొవ్వూరులో 21 కార్డుదారులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. శనివారం దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో శనివారం రంజాన్ తోఫా సరుకుల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులను ముస్లిం మహిళలు నిలదీశారు.

    కొంతమందికే సరుకులు మంజూరు చేశారని, మిగిలిన వారికి తర్వాత ఇస్తామని చెబుతున్నారని, పండగ వేళ ఇదేం దారుణమని ప్రశ్నించారు. దీనిపై సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీ ల్దార్ పోతురాజును ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రశ్నిం చగా, ప్రభుత్వానికి పంపించిన జాబితా ప్రకారం సరుకులు విడుదల కాలేదని చెప్పారు. శుక్రవారమే వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, జిల్లాలో చాలాచోట్ల శనివారం మొదలుపెట్టారు. సోమ, మంగళవారాల్లో సరుకుల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
     
     ఆవు నెయ్యి ఇస్తున్నారు
     ఇదంతా ఒక ఎత్తయితే రేషన్ దుకాణాల ద్వారా ఆవునెయ్యి సరఫరా చేశారు. ఆవు నెయ్యిని ముస్లిం లెవరూ ఆహార పదార్థాల్లో కనీస మాత్రంగానైనా వినియోగించరని తె లిసి కూడా దీనిని సరఫరా చేసి తమ మనోభావాలను దెబ్బతీశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
     నాణ్యత లేని సరుకులు
     కొన్ని మండలాల్లో పంపిణీ చేసిన సరుకులు కొంత బాగానే ఉన్నప్పటికీ చాలాచోట్ల నాసిరకం సరుకులు ఇచ్చారని ముస్లింలు ఆవేదన చెందుతున్నారు. గోధుమ పిండిలో పొట్టు అధికంగా ఉందని, అందులో కల్తీ జరిగిందని పలువురు తెలిపారు. గోధుమ పిండిలో మైదా కలిసి ఉందని చెబుతున్నారు. సేమియా కూడా నాణ్యంగా లేదని పెదవి విరుస్తున్నారు. రెండో రకం పంచదార సరఫరా చేశారని విమర్శిస్తున్నారు.
     
     రెండు రోజుల్లో ఇస్తాం
     జిల్లాలో ఇంకా 1,310 కార్డుదారులకు తోఫా
     సరుకులు అందలేదని మాకు సమాచారం అందింది.
     తహసీల్దార్లు పంపిం చిన జాబితాల్లో కొందరి పేర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సరుకులు అందని వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. వారందరికీ  సోమవారం నాడు సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
     -పి.శివశంకర్‌రెడ్డి, డీఎస్‌వో
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement