లైన్...క్లియర్ | rapprochement of the railway line of Medak - Akkannapet on 19th | Sakshi
Sakshi News home page

లైన్...క్లియర్

Published Thu, Jan 9 2014 11:38 PM | Last Updated on Mon, Oct 8 2018 9:17 PM

rapprochement of the railway line  of Medak - Akkannapet  on 19th

మెదక్, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల స్వప్నం సాకారం కాబోతోంది. మెతుకు సీమ ప్రజల పట్టువీడని పోరాటాలు.. ఆకలెరుగని దీక్షలు.. అలుపెరుగని ఆందోళనలు.. ప్రజా ప్రతినిధుల ప్రయత్నాలు..వెరసి మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. దీంతో గురువారం రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సధర్మ దేవరాయ్, ఈఈ రవీంద్రనాథ్, జేఈ వరుణ్‌కుమార్, డిప్యూటీ చీ్‌ఫ్ కమిషనర్ సుధాకర్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, మెదక్ డీఎస్పీ గోద్రూ, సీఐ విజయ్‌కుమార్‌లు మెదక్ పట్టణంలో కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.

 మూడు దశాబ్దాల ఉద్యమం
 మెదక్ -అక్కన్నపేటకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 1980లోనే ఊపిరి పోసుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా స్థానిక న్యాయవాది సుభాష్‌చంద్రగౌడ్ అధ్వర్యంలో రైల్వేసాధన సమితి ఏర్పడింది. మెదక్ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలకు తోడు  స్థానిక ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున రైల్వేలైన్ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అక్కన్నపేట నుండి మెదక్ పట్టణానికి సుమారు 17.20 కిలో మీటర్ల దూరం పుష్, పుల్(వచ్చి వెనక్కి వెళ్లేది)రైలు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం నిధులివ్వడానికి అంగీకారం తెలిపారు.

అనంతరం ఎంపీ విజయశాంతి కృషి మేరకు రైల్వేలైన్ సర్వేకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఎంపీ కోటా నుండి రూ.కోటి విడుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి మరో రూ. కోటి నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.129.32 కోట్లుగా నిర్ణయించిన అధికారులు 2012లో పింక్‌బుక్‌లో నమోదు చేశారు. మెదక్ -అక్కన్నపేట రైల్వే లైన్‌కు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితోపాటు అటవీశాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే అధికారులు తేల్చారు. అక్కన్నపేట నుంచి వచ్చేదారిలో లకా్ష్మపూర్, శమ్నాపూర్‌లతోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెదక్ పట్టణ శివారులోని సబ్‌స్టేషన్ వెనకాల గల డంప్‌యార్డ్ దగ్గర మెదక్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

 నా శ్రమ ఫలించింది
 మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ కోసం తీవ్రంగా శ్రమించాను. కేంద్రమంత్రి మల్లికార్జున్‌ఖర్గే, రైల్వే ఇంజనీరింగ్  బోర్డు చైర్మన్ ఎస్.కె.జైన్, సీఎం, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటీవ్‌లతో నిరంతరం మాట్లాడుతూ లైన్ మంజూరు కృషి చేశాను. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించాను. రైల్వేలైన్ త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరుతాయి.
 -విజయశాంతి, ఎంపీ, మెదక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement