ఆంధ్ర యూనివర్శిటీకి అరుదైన ఘనత
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో 11 వ ర్యాంకు
విజయవాడ : ఆంధ్ర విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో దేశంలో 11 వ ర్యాంకు సాధించింది. మనదేశంలోని 19 ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలలో ఆంధ్ర యూనివర్శిటీ 11వ స్థానం దక్కించుకుంది. ర్యాంకింగ్ లో మిగిలిన 10 అత్యుత్తమ విద్య సంస్థలలో ఐఐఎస్, ఐఐటీలు వున్నాయి. కాగా.. ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సహకారంతో వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచంలోనే 50 అత్యున్నత విద్యాసంస్ధల సరసన నిలబెట్టాలన్నది ఈ మిషన్ ధ్యేయమని అధికారులు తెలిపారు.
టైమ్స్ ర్యాంకు సాధించిన ఏయూ.. అంతకు ముందు బోధన, అంతర్జాతీయ దృక్పథం, పారిశ్రామిక ఆదాయ విభాగాల్లో తమ అర్హతలను, గణాంకాలను సమర్పించింది. అతి తక్కువ సమయంలో యూనివర్సిటీ పరిశోధనా, సిద్ధాంత గ్రంధాలను అంతర్జాలంలో చూసేందుకు వీలుకల్పించింది. గతంలో క్యుఎస్ బ్రిక్స్ రేటింగ్స్ లో స్థానం సంపాదించిన ఏయూ, ఇండియాటుడే-నీల్సన్ సర్వేలో భారతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో 8వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకింగ్ లో మిగిలిన టాప్ టెన్ వర్సిటీలు అన్నీ సెంట్రల్ యూనివర్సిటీలే కావడం గమనార్హం.