నవంబర్ ఆఖరులోగా ప్రభుత్వానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్సీహెచ్‌ఈ) నిర్ణయించింది. గనులు, ఖనిజాలకు సంబంధించిన పరిశోధనలు, అధ్యయనాలకు కేంద్రంగా దీన్ని కొనసాగించాలని భావిస్తోంది. ధన్‌బాద్ ఐఐఎం తరహా లో ఏర్పాటు చేసే ఈ వర్సిటీకి కొత్తగూడెం అనువైన ప్రాంతమనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమావేశ మందిరంలో టీఎస్సీహెచ్‌ఈ వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఏర్పాటుకు సింగరేణి, కోల్ ఇండియా సంస్థలు సహకరించనున్నాయి. ప్రత్యేక సాంకేతిక వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ వీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు చర్చించారు.
వర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేయడమే సరైందని సభ్యులు భావించారు. డిప్లమో నుంచి పరిశోధనల వరకు అన్ని రకాల కోర్సులు ప్రవేశపెట్టాలని, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. విద్యాకేంద్రంగా ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమల హబ్ అభివృద్ధి సాధ్యమన్నారు. వర్సిటీ ఏర్పాటుకు సభ్యులంతా ఏక గ్రీవంగా మద్దతు పలికారు. నవంబర్ ఆఖరులోగా వర్సిటీ ఏర్పాటుపై కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.