- వర్శిటీలకు విశ్రాంత సీజే పిలుపు
- పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు లేవు
- ప్రైవేట్ సంస్థల్లాగా పని చేయాలి
- విశ్వ విద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని ఆపాలి
- హంసలేఖ సహా ఆరుగురికి డాక్టరేట్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని అనేక విశ్వ విద్యాలయాలు పరీక్షా మండళ్లుగా పని చేస్తున్నాయని, పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు అక్కడ లేవని భారత విశ్రాంత ప్రధాన న్యాయమూరి ఎస్. రాజేంద్ర బాబు నిష్టూరమాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు.
బెంగళూరు విశ్వ విద్యాలయం 49వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ప్రైవేట్ సంస్థల్లాగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విశ్వ విద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని ఆపాలని అన్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో నాణ్యమైన మానవ వనరుల కొరత వల్ల విజ్ఞాన శాస్త్రం విస్తరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయానికి కఠోర పరిశ్రమ తప్ప వేరే దగ్గర దారులు లేవని అన్నారు. పరిపూర్ణ వ్యక్తిని తయారు చేయడమే విద్య అంతిమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
హంసలేఖ సహా ఆరుగురికి డాక్టరేట్లు
ఈ కార్యక్రమలో సమాజ సేవా రంగంలో ఎస్‌ఎస్. అరకేరికి డాక్టర్ ఆఫ్ లాస్ (ఎల్‌ఎల్‌డీ), జీబీ. పరమ శివయ్యకు డాక్టర్ ఆఫ్ లెటర్ (డీ.లిట్), పత్రికా రంగంలో పీ. రామయ్యకు, విద్యా రంగంలో బీటీ. లక్ష్మణ్‌కు, సంగీత రంగంలో హంసలేఖకు డీ.లిట్‌లు ఇచ్చి సత్కరించారు. ఇదే సందర్భంలో 223 మందికి పీహెచ్.డీలు ప్రదానం చేశారు. మొత్తం 33,674 మంది పట్టాలను అందుకున్నారు. వీరిలో 16.004 మంది విద్యార్థులు, 17,670 మంది విద్యార్థినులు ఉన్నారు. స్నాతకోత్సవంలో వివిధ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న 83 మంది స్వర్ణ పతకాలను అందుకున్నారు. రసాయన శాస్త్రంలో ఏఆర్. నూర్జహాన్ తొమ్మిది, ఎం.ఎస్సీ భౌతిక శాస్త్రంలో డీఎల్. శ్రుతి ఏడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.