ప‘రేషన్’
అనంతపురం అర్బన్ : జిల్లాలో రేషన్ కోసం పేదలు ఇబ్బంది పడుతున్నారు. కార్డులు రద్దు చేయడంతో కొందరికి.. కార్డు ఉన్నా వేలిముద్రలు సరిపోలడం లేదంటూ మరికొందరికి, కొత్త కార్డులు మంజూరు కాక ఇంకొందరికి రేషన్ అంద డం లేదు. ఈ-పాస్ యంత్రాలలో వేలిముద్రలు సరిపోలక రేషన్ అందని వారు జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉంటారని అధికారిక అంచనా. వీరు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. మండల స్థాయి అధికారుల ముందు వెళ్లబోసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.
దీంతో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. కార్డులు రద్దయిన పేదల పరిస్థితి మరింత దయనీయం. రోజు వారీ కూలీనాలి చేసుకుని బతుకులీడ్చే వీరికి రేషన్ సరుకులు కొంతవరకు ఆకలి బాధను తీర్చేవి. ఇప్పుడు అవి కూడా అందకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి. మరోవైపు కొత్తగా తెల్లకార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న పేదల సంఖ్య పెరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం రాకముందు జిల్లాలో 11,14,477 తెల్ల కార్డులు ఉండేవి. అనర్హుల ఏరివేతంటూ అధికారులు 94,014 కార్డులు రద్దు చేశారు.
కొత్తగా కార్డుల కోసం 17,104 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,449 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 10,27,912 తెల్లకార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు సంబంధించి 40,15,694 మంది సభ్యులుండగా.. ఆధార్ అనుసంధానం 31,79,946 మందికి పూర్తయ్యింది. అనుసంధానం కాని వారు 89,525 మంది, పెండింగ్‌లో ఉన్నవారు 51,933, తిరస్కరించిన వారు 6,94,290 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,934 చౌక దుకాణాలున్నాయి. ప్రస్తుతం 1,193 దుకాణాల్లో ఈ -పాస్ విధానం అమలు చేస్తున్నారు. వీటిలో వేలిముద్రలు సరిపోలడం లేదంటూ దాదాపు 20 వేల మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు.
అదే 2,934 దుకాణాల్లోనూ ఈ- పాస్ అమలు చేస్తే ఇలాంటి వారి సంఖ్య 50 వేలకు పైగానే చేరుకుంటుంది. వృద్ధుల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేక వేలిముద్రలు సరిగా పడవు. ప్రధానంగా ఇలాంటి వారే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఏ దిక్కూ లేని వారు అన్నపూర్ణ కార్డు ద్వారా వచ్చే బియ్యంతో బతుకీడుస్తున్నారు. ఇలాంటి వారికి బియ్యం అందకపోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు కోటా కింద 16,292.59 టన్నుల బియ్యం కేటాయించారు. లబ్ధిదారులకు పంపిణీ చేయగా 2,743 టన్నులు మిగులు చూపించారు. వేలిముద్రలు సరిపోలక, ఆధార్ లింక్ కాకపోవడం వల్లే ఈ బియ్యం పంపిణీ కాలేదని పౌర సరఫరాల శాఖ సిబ్బందే చెబుతుండడం గమనార్హం.