
కూచిపూడి నుంచి మూల్పూరు పాదయాత్రలో మేరుగ నాగార్జున
పట్నంబజారు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీవంగా నాయకులు తలపెట్టి పాదయాత్రల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నీ వెంటే.. మేమంతా అంటూ జననేత జగన్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల పరిధిలో పాదయాత్ర చేపట్టారు. పెదవడ్లపూడి గ్రామంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన 3వేల కిలోమీటర్ల మైలురాయి అభినందన కేక్‌ను కట్ చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోన రఘుపతి పట్టణం నుంచి కర్లపాలెం వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1వ వార్డు, భరంపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం కండ్లకుంట వద్ద పాదయాత్ర ప్రారంభించి గొట్టిపాళ్ల, గంగలకుంట మీదుగా సిరిగిరిపాడు వరకు 15 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నడిచారు.
తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా శారదా కాలనీ వద్ద రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. వసంతరాయపురం, డొంకరోడ్డు, కొత్తపేట మీదుగా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల మీదుగా ఆనందపేటకు చేరుకుంది. మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్‌అంబేద్కర్, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అమర్తలూరు మండలం కూచిపూడి నుంచి మూల్పూరు వరకు, వేమూరు మండలం పాలమర్రు నుంచి జంపని వరకు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ పెదకాకాని మండలం వెనిగండ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి కొప్పురావూరు, కాకాని ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించగా, సమన్వయకర్త కిలారి రోశయ్య హాజరయ్యారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు దమ్మాలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించి సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల మీదుగా భృగుబండ వరకు పాదయాత్ర చేశారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డోగిపర్రు నుంచి యలవర్తిపాడు వరకు నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పాదయాత్ర చేపట్టారు. చిలకలూరిపేట సమన్వయకర్త విడదల రజిని పట్టణంలోని ఎన్‌ఆర్టీ సెంటర్ నుంచి గాంధీపేట, సుబ్బయ్యతోట, వడ్డెరగూడెంల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో చినకొండయ్య పాలెం నుంచి సత్యనారాయణపురం వరకు సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు వెంట కార్యకర్తలు ఉత్సాహం అడుగులేశారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం పుట్లగూడెం వద్ద సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడి పాదయాత్ర ప్రారంభమై చల్లగరిక, బంగారు తండాలో జరిగింది. తెనాలి నియోజకవర్గం రూరల్ పరిధిలోని పెదరావూరు నుంచి జగ్గడిగుంటపాలెం వరకు సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment