సొంత జిల్లాలో మంత్రిగారికి చేదు అనుభవం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబుకు సొంత జిల్లాలోనే చేదు అనుభవం ఎదురైంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులతో మాట్లాడేందుకు రావెల గురువారం గుంటూరు ఐబీకి విచ్చేశారు. అక్కడే ఉన్న రైతులు... టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రుణమాఫీ పేరుతో తమను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేలు రుణం వడ్డీలకూ సరిపోదంటూ రావెలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అక్కడే ఉన్న రావెల అనుచరులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో రైతులు, రావెల అనుచరుల మధ్య తీవ్ర వాగ్విదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పక్షాల వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ముందుగా అనుకున్న ప్రకారం విజయవాడలో రైతులతో రాజధాని ఉప సంఘం సమావేశం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆ వేదిక గుంటూరుకు మార్చారు. తమ పట్ల, తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తుందని రైతులు ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వకముందే...ఈ పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భూములు ఇస్తే భవిష్యత్తులో తమను ఎవరు పట్టించుకుంటారని రైతులు ఆవేదన చెందుతున్నారు.