వణికించే చలికాలంలో వనసీమ వేడెక్కుతోంది. జిల్లా ఏజెన్సీలో ఉద్యమాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు మావోయిస్టులు పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తుండగా.. వారి అడుగు జాడలను పసిగట్టి, వారి యత్నాలను మట్టి కరిపించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన గ్రామాలు ఉద్రిక్తతకు నెలవులు కానున్నాయి. అక్కడి ప్రజలు అడకత్తెరలో పోకచెక్కలు కానున్నారు.
* ఉద్యమ బలోపేతానికి మావోయిస్టుల పూనిక
* యువకులను ఆకర్షించేందుకు ముమ్మర యత్నం
* ఏఓబీ ఇన్‌చార్జిగా రవి అలియాస్ బాలకృష్ణ
* మావోలను బలపడనివ్వరాదని పోలీసుల పంతం
రంపచోడవరం :ఒకనాడు కోల్పోయిన పట్టు కోసం మావోయిస్టులు, వారిపై పైచేయి కోసం పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో వేడి పుట్టిస్తున్నారు. మావోయిస్టులు కార్యాచరణలో భాగంగా ఫ్రంట్ ఆర్గనైజేషన్ (ఉద్యమంలో ప్రాథమిక వ్యవస్థ)ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించాలని చూస్తున్నారు. మిలీషియా సభ్యులను ఉపయోగించుకోవడం ద్వారా గ్రామాల్లో పట్టు సాధించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. సమాచార వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా పోలీసుల దాడుల నుంచి తప్పించుకుని, తిరిగి దాడులకు తెగబడేందుకు మిలీషియా సభ్యులే కీలకమని మావోయిస్టుల భావన.
అందుకే వారిని సమర్థంగా ఉపయోగించుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి షెల్టర్ జోన్‌గా ఉన్నందున ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. పోలీసు అధికారులు సైతం మావోయిస్టుల ఉద్యమంలోకి యువకుల రిక్రూట్‌మెంట్ పెరిగిందని ధ్రువీకరిస్తున్నారు. దండకారణ్యంలో పనిచేసిన మావోయిస్టు నేత కుడుముల రవి అలియాస్ బాలకృష్ణ ప్రస్తుతం ఏఓబీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.
విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రవికి తూర్పు, విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతం కొట్టిన పిండి కావడంతో పక్కా వ్యుహరచనతో ఉద్యమాన్ని నడిపించే పనిలో పడ్డారు. గతంలో లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్‌జీఎస్), ఏరియా కమిటీలతో విస్తృతస్థాయిలో పని చేసిన మావోయిస్టు పార్టీ వరుస ఎన్‌కౌంటర్‌లు, లొంగుబాట్లతో పట్టుకోల్పోయింది. దీంతో ఉన్న కొద్ది మంది ప్లాటూన్‌లుగా సంచరిస్తూ ఆత్మరక్షణలో పడ్డారు.
ప్రస్తుతం గాలికొండ ఏరియా కమిటీ, కోరుకొండ ఏరియా కమిటీలు మాత్రమే ఇక్కడ సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమానికి తిరిగి పూర్వవైభవం తెచ్చి గెరిల్లా దాడులకు సైతం తెగబడేలా వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. యువకులతో ఉద్యమాన్ని పటిష్టం చేయడం ద్వారానే పోలీసులను ఎదుర్కోగలమని వారు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉద్యమంలోకి వారిని చేర్చడంపై సర్వశక్తులూ కేంద్రీకరిస్తున్నారు.
సహకరిస్తే సహించం..
కాగా పోలీసులు మన్యంలో పరిణామాలను కంట కనిపెడుతూనే ఉన్నారు. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు నిఘా పెంచారు. ఇటీవల 40 మంది మావోయిస్టు సానుభూతిపరులను రంపచోడవరం రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని ఉద్యమ సానుభూతిపరులకు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు తాజాగా నిధుల సమీకరణపై దృష్టి సారించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగానూ వారికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యారు.
మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించినా సహించబోమని కొందరు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండడం, అక్కడి సరిహద్దు గ్రామాలు విభజన అనంతరం తూర్పు ఏజెన్సీలో విలీనం కావడంతో ఆ ప్రభావం ఇక్కడ తప్పక ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆరునూరైనా ఇక్కడ ఉద్యమాన్ని బలపడనివ్వరాదని పట్టుదలతో ఉన్నా రు. ఈ క్రమంలోనే బుధవారం 13 మం ది మిలీషియా సభ్యులను అరెస్టు చేశా రు. గురువారం కాకినాడలో ఈ విషయా న్ని తెలిపిన ఎస్పీ రవిప్రకాష్.. మావో యిస్టులకు ఎవరు సహకరించినా కఠినం గా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కానలో కాక
Published Fri, Nov 14 2014 3:42 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement