జైలు నుంచి విడుదలైన రవికిరణ్, రవీంద్ర
ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ధ్వజం
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు లోకేశ్ ఆదేశాల మేరకే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, దరువు వెబ్ పోర్టల్ ప్రతినిధి ఇప్పాల రవీంద్ర మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే ఆరోపణపై వీరిని ఇటీవల అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. వీరు బుధవారం ఉదయం జైలు నుంచి బెయిలు మీద విడుదలయ్యారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. రవికిరణ్ మాట్లాడుతూ టీడీపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కక్ష సాధింపుగా అరెస్ట్ చేసి హింసలు పెట్టారని, ఎమ్మెల్యే అనితను దూషించినట్లు గత నెలలో విశాఖలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు.
మళ్లీ పీటీ వారెంట్‌పై తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలుకు తీసుకెళ్లారని, ఆరు రోజులు రాత్రి పూట 8 నుంచి 2 గంటల వరకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గుంటూరు నుంచి విశాఖ జైలుకు తీసుకొచ్చారన్నారు. లోకేశ్ అనేక సందర్భాల్లో నోరు జారిన వీడియోలనే పోస్టు చేశాను తప్ప తానేమీ కొత్తగా సృష్టించలేదన్నారు. తనకు తన కుటుంబానికి ఏం జరిగినా చంద్రబాబు, లోకేశ్‌లదే బాధ్యత అన్నారు. ఇప్పాల రవీంద్ర మాట్లాడుతూ, అన్యాయాలను, వాస్తవాలను, ప్రభుత్వ తప్పుడు విధానాలను సోషల్ మీడియోలో పోస్టు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం వైఫల్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను సోషల్ మీడియా ద్వారా ప్రాణమున్నంత వరకు ఎండగడతామని స్పష్టం చేశారు.