రాయచోటికి మహర్దశ | Rayachoti Upgraded In Grade One Municipality In YSR Kadapa | Sakshi
Sakshi News home page

రాయచోటికి మహర్దశ

Published Fri, Aug 30 2019 9:14 AM | Last Updated on Fri, Aug 30 2019 11:57 AM

Rayachoti Upgraded In Grade One Municipality In YSR Kadapa - Sakshi

రాయచోటి మున్సిపల్‌ కార్యాలయం భవనం

సాక్షి, రాయచోటి : కరవు కాటకాలకు కేరాఫ్‌గా ఉంటున్న రాయచోటి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈవిషయంలో చొరవ తీసుకుని తన నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. కరవును శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.800 కోట్లతో గండికోట నుంచి రాయచోటికి కృష్ణా జలాలను అందించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు.

ఈ దిశగా అనుమతులు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రాయచోటి వాసుల రెండు కలలు నెరవేరుతున్నాయి. రాయచోటి గ్రేడ్‌–3 మున్సిపాలిటిని గ్రేడ్‌–1గా అప్‌గ్రేడు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మరో జీఓ కూడా విడుదల అయింది. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రి 50పడకల స్థాయిగా కొనసాగుతోంది. పడకలు పెంచాలనేది చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష. ఈ రెండు జీఓలు ఒకేసారి విడుదల కావడంతో రాయచోటి ప్రజానీకం హర్షం వ్యక్తంచేస్తోంది.

పోరాటాలు లేకుండానే....
నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా తొమ్మిది మండలాల ప్రజలకు వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. పడకలు సరిపడేవి కావు. వంద పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ  10 సంవత్సరాలుగా పోరాటాలు నడిచాయి. అయినా గత ప్రభుత్వాలు స్పందించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపుగా పడకలు పెంచుతున్నట్లు తప్పుడు ఉత్తర్వు జారీ చేసి అభాసుపాలైంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా వంద పడకల ఆసుపత్రిగాను, గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా మారుస్తామన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మూడు నెలల్లోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుండటంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.

గ్రేడ్‌ –1గా మున్సిపాలిటీ ఉన్నతీకరణ  
2005లో పంచాయతీగా ఉన్న రాయచోటిని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేడ్‌ –3 మున్సిపాలిటీలో 97మంది ఉద్యోగులుండాలి. కానీ 36 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా మిగిలిన పోస్టులు ఖాళీగా వున్నాయి. ఉద్యోగుల కొరతతో పాటు జనాభా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలిగేలా నిధులు విడుదల కావడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గ్రేడ్‌–1గా పెంచేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. మున్సిపల్‌మంత్రి బొత్ససత్యనారాయణతో పలుమార్లు మాట్లాడారు. ఫలితంగా గురువారం మున్సిపాలిటి అప్‌గ్రేడేషన్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. మున్సిపాలిటీ స్థాయి పెరగడం వల్ల  కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల నుండి వివిధరకాల పథకాల పేరిట నిధుల విడుదల పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. లక్షరూపాయల వరకు అత్యవసర పనులను కమిషనరు నామినేషన్‌ పద్ధతిలో చేపట్టవచ్చు.

రాయచోటి రూపురేఖలే మారతాయి
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన ప్రేమాభిమానాల వల్ల రాయచోటి నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. రాయచోటి ఆసుపత్రిని వంద పడకల స్థాయిగా పెంచడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే మున్సిపాలిటీ కూడా గ్రేడ్‌–1గా మార్చేందుకు వీలు కల్పించారు. ఆసుపత్రికి అదనంగా 12 మంది వైద్యులతో పాటు 25 మంది సిబ్బంది సంఖ్య పెరగుతుంది. వైద్య సేవలూ విస్తృతమవుతాయి.  రాయచోటిని విద్యా హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం.    – ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement