ఆమరణ దీక్షలు భగ్నం
Published Mon, Aug 26 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
రాయదుర్గం, తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేపట్టడం వల్ల వారి బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు పేర్కొనడంతో రాయదుర్గంలో ఎస్‌ఐ రాఘవరెడ్డి మహిళా, పోలీసు సిబ్బందితో శిబిరానికి చేరుకున్నారు. దీక్షను భగ్నం చేయకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు.
అయినా పోలీసులు దీక్షను భగ్నం చేసి.. కాపు భారతిని బలవంతంగా అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు, నాయకులను పక్కకు తోసేసి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను వైద్యం చే యించుకోనని మూడు గంటలపాటు ఆమె మొండికేశారు. వైఎస్ విజయమ్మ దీక్ష కొనసాగే వరకూ తాను కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు, ఎస్‌ఐ చెప్పినా ససేమిరా అన్నారు. చివరకు ఎమ్మెల్యే ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో బంధువులు కంటనీరు పెట్టుకుంటూ ఆమె వద్దే ఉండిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అందరూ ఒత్తిడి చేసి ఆమెకు కొబ్బరి నీళ్లు తాగించి.. చికిత్స ప్రారంభించారు.
తాడిపత్రిలో పైలా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు డీఎస్పీ నాగరాజుకు సమాచారమిచ్చారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ సీఐలు లక్ష్మినారాయణ, మోహన్.. సిబ్బందితో రాత్రి 9.30 గంటలకు దీక్షా స్థలికి చేరుకుని పైలాను బలవంతంగా 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. తాను దీక్ష విరమించేది లేదని ఆయన అక్కడ చాలా సేపు మొండికేశారు. ఎట్టకేలకు వైద్యులు, పోలీసులు నచ్చజెప్పి ఆయనకు వైద్యం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి నియోజక వర్గ సమన్వకర్త వి.ఆర్.రామిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని పైలాను పరామర్శించారు.
Advertisement
Advertisement