నేడు ‘సీమ’ బంద్
ఆర్‌ఎస్‌ఎఫ్ పిలుపు
వైవీయూ : రాయలసీమ ప్రజల హక్కు అయిన రాజధానిని కోస్తా ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ గురువారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కోరారు. బుధవారం నగరంలోని పలు కూడళ్లలో బంద్‌ను విజయవంతం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ మల్లెల భాస్కర్ మాట్లాడుతూ కోస్తాలో రాజధానిని పెట్టడాన్ని అడ్డుకోని రాజకీయ పార్టీలు, నాయకులు రాయలసీమ ద్రోహులేనన్నారు.
రాజధానిని, కృష్ణాజలాలు, ప్యాకేజీలు, పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు అన్నీ కోస్తాకే పంచి రాయలసీమకు మాత్రం కన్నీళ్లనే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎఫ్ కో కన్వీనర్ దస్తగిరి, నాయకులు నాగార్జున, లెనిన్‌ప్రసాద్, సురేంద్ర, రఘు, అనిల్, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాయలసీమ బంద్‌కు ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు నాగేంద్రకుమార్‌రెడ్డి, తరుణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల మద్దతు
రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయకుండా కోస్తాకు తరలించడాన్ని నిరసిస్తూ చేపట్టిన రాయలసీమ బంద్‌కు ప్రైవేట్ పాఠశాలలు సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అన్‌ఎయిడెడ్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. రామచంద్రారెడ్డి, గంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
బంద్‌కు న్యాయవాదుల మద్దతు
కడప లీగల్ : రాయలసీలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ గురువారం చేపట్టిన బంద్‌కు కడప న్యాయవాదులు మద్దతు ప్రకటిస్తున్నట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.